Bengaluru: వేసవి కాలం వస్తుందంటే నీటి కష్టాలు ప్రారంభమైనట్లే. దీంతో ప్రభుత్వాలుసైతం అప్రమత్తం అవుతాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కోవలో బెంగళూరు నగరం కూడా ఉంది. వేసవి కాలంలో బెంగళూరు నగరంలో తాగునీటి కష్టాలు ఎక్కువే. తాజాగా.. ఓవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోయాయని బెంగళూరు వాటర్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది నీళ్ల కరువుతో బెంగళూరులో 14వేల బోర్లు ఎండిపోయాయని, ఈసారి తాగునీళ్లను పొదుపుగా వాడుకోవాలని నగరవాసులకు వాటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకేసి తాగేనీళ్లను ఇతర పనులకు వాడితే భారీగా ఫైన్ విధిస్తామని తేల్చిచెప్పింది.
మరికొద్ది రోజుల్లో వేసవికాలం ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచే ఎండలు దంచికొడుతున్నారు. దీంతో భూగర్భ జలమట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బెంగళూరు వాటర్ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగర వాసులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వేస్ట్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. తాగే నీటిని కార్లు కడిగేందుకు ఉపయోగించినా, గార్డెనింగ్ కు, ఫౌంటేన్ లు, ఇతరత్రా సరదా పనులకు తాగునీటిని వినియోగిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని నగర వాసులకు బెంగళూరు వాటర్ బోర్డు సూచించింది. అంతేకాదు.. సినిమా హాల్స్, మాల్స్ లో క్లీనింగ్ కు తాగునీళ్లు వాడకంపై నిషేధం విధించినట్లు ప్రకటించింది.
తాగునీటిని వృథా చేసినట్లు గుర్తిస్తే తమ కాల్ సెంటర్ 1916 కు సమాచారం ఇవ్వాలని నగర వాసులకు బెంగళూరు వాటర్ బోర్డు సూచించింది. తాగునీరు వేస్ట్ చేస్తే తొలుత రూ.5వేలు ఫైన్ విధిస్తారు. మళ్లీ వాటర్ ను వేస్ట్ చేస్తూ పట్టుబడితే అదనంగా మరో ఐదువేలు ఫెనాల్టీ విధిస్తామని, ఆపైకూడా నీటిని వృథా చేసినవాళ్లకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తామని బెంగళూరు వాటర్ బోర్డు స్పష్టం చేసింది.