Maoist Leader Killed: ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయారు. అది మరువక ముందే మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి చెందారు.
బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కీలక మావోయిస్టు నేత సుధాకర్ మరణించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో సుధాకర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలలో ఆయనొకరు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డ్ ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. గత 6 నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. గతేడాది నుంచి ఊపందుకుంది. ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. ఏప్రిల్ చివరి వారంలో అనేకమంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 24 మంది సరెండర్ అయ్యారు. అటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులను ఏరిపారేస్తున్నాయి.
మరోవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. జూలై 11 నుంచి ఆగస్ట్ 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తామంది.