దద్దరిల్లిన పార్లమెంట్ : ఎలక్టోరల్ బాండ్లు ఓ పెద్ద స్కామ్.. కాంగ్రెస్ వాకౌట్

  • Publish Date - November 21, 2019 / 11:36 AM IST

పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల నుంచి వాకౌట్ చేసింది. దీంతో మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. 

లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల అంశంపై లేవనెత్తింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రెండెంటిని భారీ కుంభకోణాలుగా అభివర్ణించింది. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో అవినీతిని క‌ప్పుపుచ్చుతున్నార‌ని ప్రభ్వుత్వంపై ఆరోపణలు గుప్పించింది. లోక్ సభలో 15 నిమిషాల వ్యవధి ఆందోళనలు, నిరససనలతోనే కొనసాగింది. కాంగ్రెస్ ఎంపీలంతా నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్ దగ్గరగా వెళ్లి నిరసన గళం వినిపించారు. ఈ క్రమంలో సభలో విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 

ఎలక్టోరల్ బాండ్ల అంశంపై ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీతో మొదలైంది. ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చినా.. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా అధికారికంగా అవినీతికి పాల్పడిందని ఆయ‌న స‌భ‌లో ప్రస్తావించారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు పీఎంఓ కార్యాలయమే ప‌చ్చ‌జెండా ఊపింద‌ని ఆయన ఆరోపించారు. దీంతో స్పీకర్ వెంటనే తివారీ మైక్రోఫోన్ కట్ చేసి.. మరో సభ్యుడిని ఈ సమస్యపై మాట్లాడాలన్నారు.

అదే సమయంలో సోనియా గాంధీ తన సీట్లో నుంచి లేచి వాకౌట్ ప్రకటించారు. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది.  ఎలక్టోరల్ స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో మనీలాండరింగ్ పెరిగిపోయిందని, రాజకీయ పార్టీల్లో నిధుల పారదర్శకత నశింపచేసిందని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు