Meghalaya Honeymoon Case: హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సోనమ్ తన భర్తను చంపించింది రాజ్ కోసం కాదా? మరొక వ్యక్తితో పారిపోవాలని ప్లాన్ చేసిందా?

సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్‌లో ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు.

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సోనమ్ గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ప్రియుడి కోసం కిరాయి హంతకులతో భర్తను భార్యే చంపించిన వైనం షాక్ కి గురి చేస్తోంది. హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి కిరాయి హంతకులతో మర్డర్ చేయించింది సోనమ్. ఈ కేసు విచారణలో సోనమ్ గురించి మరిన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి పోలీసులకు. తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. సోమన్ తన భర్తను హత్య చేయించింది ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం కాదని, ఆమె మరొక వ్యక్తితో పారిపోవాలని చూసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడీ ట్విస్ట్ సంచలనంగా మారింది. అదే నిజమైతే ఆ వ్యక్తి ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.

సోనమ్ తన ప్రియుడు రాజ్ కోసం భర్త రాజా రఘువంశీని హత్య చేయించిందని పోలీసులు అనుమానించారు. అయితే, విచారణలో మరో షాకింగ్ విషయం తెలిసింది. సోనమ్ ఇదంతా చేసింది రాజ్ కోసం కాదని, మరో వ్యక్తి కోసం అని సందేహిస్తున్నారు. ఈ కుట్రలో రాజ్ ను ఒక పావుగా సోనమ్ వాడుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.

హనీమూర్ మర్డర్ కేసులో రాజ్ ప్రధాన కుట్రదారుడని గతంలో వచ్చిన ఊహాగానాలకు విరుద్ధంగా, ఇప్పుడు అతడిని ఒక పెద్ద ప్రణాళికలో పావుగా సోనమ్ ఉపయోగించుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోనమ్ వేరొకరితో పారిపోవాలని ప్లాన్ చేసిందని అంటున్నారు. సోనమ్ గేమ్ గురించి తెలియని రాజ్.. ఆమె కుట్రలో భాగమయ్యాడని అంటున్నారు. సోనమ్ అందరినీ మోసగించినట్లు, ప్రేమ వాగ్దానాలతో రాజ్ ను ఆకర్షించినట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు.

సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్‌లో ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు. ”ఆమె ఆ ప్రదేశాన్ని స్వయంగా ఎంచుకుంది, చెల్లింపులు కూడా చేసింది. ఆ ప్రదేశాన్ని చాలా రహస్యంగా ఉండేలా చూసుకుంది. ఈ విషయం ఆమె సహ నిందితులకు కూడా తెలియకుండా చూసుకుంది. సోనమ్ కి తప్ప మరెవరికీ ఈ ఫ్లాట్ చిరునామా తెలియదు” అని పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సోనమ్ కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నప్పుడు.. సోనమ్ ఎక్కువ సమయం ఇండోర్‌లోనే ఉండిపోయిందని అధికారులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఈ పథకం బయటపడటం ప్రారంభమైందని గ్రహించిన ఆమె, తనకు క్యాబ్ బుక్ చేయాలని రాజ్ చెప్పి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. జూన్ 8న పోలీసులు ఆమెను అక్కడ గుర్తించారు. “జూన్ 6న సోనమ్‌ను యూపీలో దింపిన క్యాబ్ డ్రైవర్‌కు రాజ్ చెల్లింపులు చేశాడు” అని ఒక అధికారి తెలిపారు. సోనమ్ పరారీలో ఉన్నప్పుడు బస చేసిన ఫ్లాట్ కచ్చితమైన స్థానం ఇంకా తమ వద్ద లేదని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్ధారించారు.

Also Read: విమాన ప్రమాదంలో గుండెలు పిండే విషాదం.. డాక్టర్ ఉద్యోగం వదిలేసి భర్త, పిల్లలతో లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ దుర్మరణం..

జూన్ 9న ఘాజీపూర్‌లోని హైవే ధాబా దగ్గర సోనమ్ తన మొబైల్ ఫోన్‌ను ఆన్ చేసి, ఆమె ఉన్న ప్రదేశాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు. ఫోన్ త్వరగా ఆపివేయబడినప్పటికీ, నిఘా సెల్స్ ఆమె ఉన్న లొకేషన్ ను ట్రాక్ చేయడం ప్రారంభించాయి. “రాజా హత్య తర్వాత సోనమ్ తన సొంత ఫోన్‌ను పక్కన పెట్టింది. రాజ్ కుష్వాహా, ఇతరులను సంప్రదించడానికి వేరే వ్యక్తుల ఫోన్లను ఉపయోగించింది” అని పోలీసులు వెల్లడించారు. “ధాబా యజమాని ఫోన్ నుండి తన సోదరుడికి కాల్ చేసే ముందు, ఆమె తన ఫోన్‌ను ఆన్ చేసింది. బహుశా బంధువుల నంబర్‌ను నోట్ చేసుకోవడానికి కావొచ్చు. దీంతో మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు SOS పంపారు, వారు మమ్మల్ని అప్రమత్తం చేశారు” అని పోలీసు అధికారి చెప్పారు.

”సోనమ్ ఇండోర్ లో మూడు ఫోన్లు కొనుగోలు చేసింది. ఒక బేసిక్ కీ ప్యాడ్ హ్యాండ్ సెట్, రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు. నిందితుల్లో ఒకడైన ఆనంద్ కుర్మి డాక్యుమెంట్స్ ఉపయోగించి సోనమ్ ఫోన్లు కొనుగోలు చేసింది. ఫోన్లు కొనేందుకు ఆమెకు రాజ్ సహకారం అందించాడు. ఆ మూడు ఫోన్లు, వాటిలోని సిమ్ కార్డులను మేఘాలయలో ధ్వంసం చేశారు. డిజిటల్ ఫూట్ ప్రింట్స్ దొరక్కుండా, ఆచూకీ కనిపెట్టకుండా సోనమ్ ఇలా చేసి ఉండొచ్చని” దర్యాఫ్తు అధికారి ఒకరు చెప్పారు.