bihar assembly elections 2020.. beggar candidate plurals party jamui : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి ఓ అభ్యర్థి ‘‘నాకు కనీసం నామినేషన్ వేయటానికి కూడా డబ్బుల్లేవ్..అంటూ బిచ్చమెత్తుకుంటూ వచ్చి నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదేదో మీడియా దృష్టిని ఆకర్షించటానికి కాదు..ఓటర్లను ఆకట్టుకోవటానికి కూడా కాదు..మరి ఎందుకో తెలుసుకుందాం..
జముయీ పరిధిలోని ఝాఝా అసెంబ్లీ స్థానం నుంచి పుష్పం ప్రియాకు చెందిన ప్లురల్స్ పార్టీ తరపున సూర్యవత్స అనే సమాజ సేవకుడు పోటీ చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు లగ్జరీ వాహనాల్లో వచ్చి నామినేషన్లు వేస్తుండగా..ప్లురల్స్ పార్టీ అభ్యర్థి సూర్యవత్స మాత్రం బిచ్చమెత్తుకుంటూ ఎన్నికల్లోకి దిగారు. ఒక సాధారణ వస్త్రాన్ని కప్పుకుని, కాళ్లకు హవాయి చెప్పులు వేసుకుని..చేతి జోలె పట్టుకుని వచ్చి నామినేషన్ వేశారు. ఆయన జోలెలో కొన్ని డబ్బులు ఉన్నాయి.
ఈ సందర్భంగా సూర్యవత్స మాట్లాడుతూ..తాను బిచ్చమెత్తుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా డబ్బులు సరిపోకపోవడంతో బిచ్చమెత్తుతున్నానని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తానని దయతలచి తనకు బిచ్చమేస్తే ఆ డబ్బులతో ఎన్నికల్లో ఖర్చు చేసుకుని పోటీ చేస్తానని..తాను నెగ్గితే తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చటానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
ఇదేదో సూర్యవత్స పబ్లిసిటీ కోసమో లేదా ఓటర్లను ఆకట్టుకోవటానికో కాదు..సూర్యవత్స నిజంగా అతి సామాన్యంగా జీవిస్తుంటారు. సమాజ సేవకునిగా పనిచేసే ఆయన ఏడాది పొడవునా కేవలం రెండు జతల దుస్తులతోనే గడుపుతారు.
కష్టంలో ఉన్న పేదలకు సేవచేస్తుంటారు. చలికాలంలో రైల్వే స్టేషన్ల వద్ద ఉండే పేదలకు కంబళ్లను పంచుతుంటారు. పేదల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని..అంతేతప్ప తనకు పదవులపై ఎటువంటి ఆశలు లేవని సూర్యవత్స స్పష్టం చేశారు. సూర్యవత్స గాంధేయవాదిగా స్థానికంగా పేరు పొందారు.