Bihar CM on RJD leader Shyam Rajak’s claim బీహార్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి నితీశ్‌కు షాక్ ఇచ్చారు. ఈ సంగతి మరువక ముందు ఆయన సొంత రాష్ట్రం బీహార్‌లోనే ఎదురుగాలి మొదలైనట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆశక్తికరంగా మారాయి.
నితీష్ కుమార్ బీజేపీతో మైత్రిని వదిలి ఆర్జేడీతో చేతులు కలపాలని మంగళవారం ఆర్జేడీ సీనియర్ నాయకుడు, బీహార్ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే చౌదరి వ్యాఖ్యాలు చేసిన కొన్ని గంటల్లోనే బుధవారం(డిసెంబర్-30,2020) ఆర్జేడీ నేత, మాజీ జేడీయూ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.
17మంది జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాంటూ బుధవారం ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా ఆ 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రజాక్ వ్యాఖ్యానించారు. అయితే, తాము మొత్తం 28 మంది గ్రూప్‌గా రావాలని వారికి సూచించామని, అతి త్వరలోనే వారి సంఖ్యాబలం 28కి చేరుకుంటుందని, ఆ రోజుతో నితీశ్ సర్కారు కుప్పకూలుతుందని రజాక్ పేర్కొన్నారు.
అయితే శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రజాక్ చేసిన వ్యాఖ్యాలను నితీష్ తోసిపుచ్చారు. అవి నిరాధార వ్యాఖ్యలని కొట్టిపారేశారు. జేడీయూ నుంచి 17 మంది కాదు కదా ఒక్కరు కూడా ఆర్జేడీలోకి వెళ్లబోరని తేల్చిచెప్పారు.
నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిని వీడి మహఘట్‌బంధన్‌లో చేరి తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంగళవారం ఆర్జేడీ నేత ఉదయ్ నారాయణ్ చౌదరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు సీఎం పగ్గాలు అప్పగించాలని కోరారు. బీహార్ ముఖ్యమంత్రి పీఠం తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్‌ను విపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటామని బంపరాఫర్ ఇచ్చారు.