Polling ends for first phase బీహార్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ మొదటి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 54శాతం శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం.
మొదటి దశలో ఇవాళ పోలింగ్ జరిగిన 71స్థానాల్లో మొత్తం 1066 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 952మంది పురుషులు,114మంది మహిళలు ఉన్నారు. కేబినెట్ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు.
కాగా, నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు, మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.
ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ 110సీట్లలో పోటీలో ఉండగా,జేడీయూ 115అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక, మహాఘట్ బంధన్ కూటమిలో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ 114స్థానాల్లో బరిలోకి దిగుతుండగా,70స్థానాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. మరోవైపు, 143స్థానాల్లో మాత్రమే ఎల్జేపీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది