అక్టోబర్ మొదటి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకూ…

కాంగ్రెస్‌ పార్టీ "ఓట్‌ చోరీ" అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది.

Bihar polls: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఛట్‌పూజ తరువాత జరిగే అవకాశముందని తెలుస్తోంది. చట్‌పూజ అక్టోబర్ 28న ఉండగా, నవంబర్ 5 నుంచి 15 మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అక్టోబర్ మొదటి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సహా దేశంలో ఖాళీగా పలు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగే అకాశం ఉంది. ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా అక్టోబర్ మొదటివారంలోనే షెడ్యూల్ వెలువడనున్నట్లు తెలుస్తోంది.

బిహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22న ముగుస్తుంది. ఆ తేదీకి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వచ్చే వారం బిహార్‌లో పర్యటించి ఏర్పాట్లను సమీక్షిస్తారు.

కాంగ్రెస్‌ పార్టీ “ఓట్‌ చోరీ” అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఓటరు తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటిస్తారు.

Also Read: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..

ఈసారి కూడా బిహార్‌లో పలు దశల్లో పోలింగ్ జరగనుంది. 2020 ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అక్టోబర్ 28న 71 స్థానాలు, నవంబర్ 3న 94, నవంబర్ 7న 78 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఫలితాలను నవంబర్ 10న ప్రకటించారు. 2015లో పోలింగ్ ఐదు దశల్లో జరిగింది.

భారతీయ జనతా పార్టీ, జనతా దళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్)లతో కూడిన ఎన్డీఏ మరోసారి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో అధికారంలోకి రావాలని ఎన్నికల బరిలోకి దిగుతోంది.

ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 243 సభ్యుల సభలో ఎన్డీఏకి ప్రస్తుతం 131 మందితో మెజారిటీ ఉంది. బీజేపీ 80, జనతా దళ్ (యునైటెడ్) 45, హిందుస్థాని అవామ్ మోర్చా (సెక్యులర్) 4, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

ఇండియా కూటమికి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో రాష్ట్రీయ జనతా దళ్ నుంచి 77, కాంగ్రెస్ 19, సీపీఐ (ఎంఎల్) 11, సీపీఐ (ఎం) 2, సీపీఐ 2 సీట్లు ఉన్నాయి.