Singareni Workers: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..
సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Singareni Workers: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కారు బోనస్ ప్రకటించింది. గత ఏడాది 33 శాతం వాటాను కార్మికులకు పంచిన విషయం తెలిసిందే. ఈ సారి 34 శాతం వాటాను పంచాలని నిర్ణయం తీసుకుంది.
ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మవంటిది. ఈ సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు.. అది ఒక ఉద్యోగ గని. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న యాజమాన్యానికి అభినందనలు. (Singareni Workers)
Also Read: కేటీఆర్ ఆ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు?: బండి సంజయ్
సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారు. కోల్‌ఇండియాలో ఇవ్వని అలవెన్సులు కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం” అని తెలిపారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. సంస్థ మొత్తం రూ.6,394 కోట్లు అర్జించిందని అన్నారు.
“ప్రభుత్వానికి సింగరేణి కొన్ని ప్రతిపాదనలను ఇచ్చింది. రెండు బ్లాకులను సింగరేణి పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నాం. ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. మినరల్స్ కోసం క్రిటికల్ మైనింగ్ లో వెళ్లాలని సింగరేణి నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో మైనింగ్ కోసం ఆక్షన్‌లో పాల్గొని గోల్డ్ మైన్ కూడా పొందాం. సింగరేణి విస్తరణకు రూ.4,034 కోట్లు కేటాయించాం” అని భట్టి విక్రమార్క అన్నారు.
కాంట్రాక్ కార్మికులకు రూ. 5,500 చొప్పున: రేవంత్ రెడ్డి
సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 6,394 కోట్ల రూపాయల లాభాలు వస్తే, 4,034 కోట్ల రూపాయలు భవిష్యతు పెట్టుబడుల కోసం కేటాయించిందని చెప్పారు. 2,360 కోట్ల రూపాయలను సింగరేణి ఉద్యోగులకు లాభాల వాటా బోనస్ గా ఇస్తున్నామని వివరించారు. 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ కింద 5,500 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.