దాల్ సరస్సులో బీజేపీ ర్యాలీ…కార్యకర్తల పడవ బోల్తా

BJP Campaign Shikara Overturns In Dal Lake శ్రీనగర్ లోని ప్రసిద్ధ దాల్‌ సరస్సులో ఆదివారం(డిసెంబర్-13,2020) బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తల పడవ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా నీటిలో పడిపోయారు.

ప్రస్తుతం జమ్మకశ్మీర్‌లో దశలవారీగా జిల్లాఅభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్‌ సరస్సులో పర్యాటకులు విహరించే పడవలైన షికారాలపై బీజేపీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, పలువురు బీజేపీ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.

అయితే, పరిమితికి మంచి ఎక్కువ మంది ఎక్కడంతో ఒడ్డుకు సమీపిస్తున్న సమయంలో ఓ పడవ బోల్తాపడింది. దీంతో ఆ పడవలో ఉన్న నలుగురు బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టులు నీటిలో పడిపోయారు. 17వ ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కలిసి నీటిలో పడిపోయిన వారిని కాపాడారు. అందరూ ప్రాణాలతో బయటపడటంతో నేతలు ఊపిరిపీల్చుకున్నారు. నీటిలో పడిపోయినవారిని ముందుజాగ్రత్తగా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఆదివారం డీడీసీ ఆరో దశ పోలింగ్‌ జరిగింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరో దశ డీడీసీ ఎన్నికల్లో 51.51శాతం పోలింగ్ నమోదైనట్లు జమ్మకశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ ప్రకటించారు. కాగా,మొత్తం 8 దశల్లో జరుగుతున్న డీడీసీ ఎన్నికలు ఈ నెల 19తో ముగుస్తాయి. 22న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.