బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికలపై వారు చర్చించారు.
ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. రెండు రాష్ట్రాల పార్టీ నాయకులతోవారు చర్చించారు. మహారాష్ట్రలో శివశేనతో పొత్తు, ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లపై నేతలు చర్చించారు. మహారాష్ట్ర లో శివసేనతో సీట్ల సర్దుబాటుపై ఆదివారమే స్పష్టత రానుంది.
మహారాష్ట్రలోని 288 స్ధానాల్లో బీజేపీ 144, శివసేన 126స్ధానాల్లో పోటీ చేస్తాయని, మిగతా 18 స్ధానాల్లో చిన్నపార్టీలకు కేటాయిస్తారని తెలుస్తోంది. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి బీజేపీతో అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీ త్వరలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కార్యక్రమంలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.