అనంతకుమార్ భార్యకు నో టికెట్ : తేజశ్వి సూర్యకు ఛాన్స్

  • Publish Date - March 26, 2019 / 10:21 AM IST

బెంగళూరు:  బీజేపీ కంచుకోటలాంటి  బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా  తీవ్ర ఉత్కంఠ  కొనసాగింది. ఇక్కడ్నించి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద్ర మంత్రి, దివంగత సిట్టింగ్ ఎంపీ అనంతకుమార్ భార్య తేజశ్వినీ ని పోటీకి  దింపుతారని భావించారు కానీ, అర్ధరాత్రి ప్రకటించిన జాబితాలో 27 ఏళ్ల యువకుడైన తేజశ్వి సూర్య పేరు ఉంది. 1996 నుంచి 2014 వరకు బెంగళూరు సౌత్ లో కీశే. అనంతకుమార్ గెలుస్తూ వస్తున్నారు.

అనంతకుమార్ మరణించటంతో ఆయన భార్య తేజశ్విని పేరునే రాష్ట్ర బీజేపీ హైకమాండ్ కు పింపించింది.  రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కూడా తేజశ్వినీ కే మద్దతు తెలిపారు. ఇక ఆమె పేరు ప్రకటించటమే తరువాయి అనుకున్నారు. ఈ లోపు ప్రధాని మోడీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ బలమైన అభ్యర్ధి, రాజ్యసభ ఎంపీ బీకే హరిప్రసాద్ ను బరిలోకి దింపింది. 1999 లోక్ సభ ఎన్నికల్లో అనంత కుమార్ కంటే 65వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. దీంతో బీజేపీ హైకమాండ్ అక్కడ మరో బలమైన అభ్యర్ధి కోసం గాలించి  చివరికి సంఘ్ నేపధ్యం ఉన్న యువకుడు తేజశ్వి సూర్య పేరును ప్రకటించింది. 

కర్ణాటక లో కాంగ్రెస్ జేడీఎస్ లకు  చెక్ పెట్టందుకు తేజశ్వి సూర్యను  బీజేపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది. యువకుడైన తేజశ్విసూర్యకి హిందుత్వ వాదిగా పేరుంది. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సూర్య… రాష్ట్ర బీజేపీ  ఉపాధ్యక్షుడి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ మీడియా సెల్ లో కీలకంగా వ్యవహరించే సూర్య యడ్యూరప్ప క్యాంప్ తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.  సూర్య మేనమావ రవిసుబ్రహ్మణ్యం  కూడా బెంగుళూరు సౌత్ నియోజక వర్గం బసవనగుడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడోసారి గెలుపొంది సేవలందిస్తున్నారు. సూర్యకి టికెట్ ఇవ్వటంపై స్పందించిన తేజశ్విని…..తనకు దేశం ప్రధమ ప్రాధాన్యమనీ, పార్టీ రెండోదనీ, తన వ్యక్తిగత జీవితం చివరిదని వ్యాఖ్యానించారు.  తేజశ్వి సూర్య అభ్యర్ధిత్వాన్ని అనంతకుమార్ వర్గీయులు ఒప్పకోకపోయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాల్సి ఉంటుంది. 1977 నుంచి బెంగుళూరు సౌత్ కి బ్రాహ్మణులే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తేజశ్వి సూర్యకూడా బ్రాహ్మణుడే  కావటం, అతని కుటుంబ సభ్యులకు సంఘ్ నేపధ్యం ఉండటం కూడా మరో ప్లస్ పాయింట్. మే 23న  విడుదయ్యే ఫలితాల్లో ఆయన భవిష్యత్ ఏమిటన్నది తేలనుంది.