Narendra modi
భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బలపడిన బీజేపీ… 2019 ఎన్నికల్లో 303 ఎంపీలను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకోసం వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ ప్రభావం ఎక్కువగానే ఉన్నా.. దక్షిణాదిలో కర్ణాటక మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు.
దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 133 ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనే 42 ఎంపీ స్థానాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీతోపాటు, దానికి మద్దతిచ్చే పార్టీలకు ఎక్కువ సీట్లు దక్కేలా వ్యూహ రచన చేస్తోంది కమలం పార్టీ.
2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 2019లో బీజేపీ ఓటుబ్యాంకు గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికల్లో 17.1 కోట్ల ఓట్లు దక్కించుకున్న ఆ పార్టీ అభ్యర్థులు.. 2019లో 22.6 కోట్ల ఓట్లు సాధించారు. ఇక 2014లో 10.69 కోట్ల ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. 2019లో 11.86 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా 2019లో బీజేపీ సొంతంగా 303 ఎంపీ స్థానాల్లో గెలిస్తే.. ఎన్డీయే కూటమి 350 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో గెలుపొందితే.. యూపీయే కూటమి విజయం సాధించింది 85 సీట్లలో మాత్రమే.
400 సీట్లు లక్ష్యం
ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి 300 సీట్లకు పైగా సాధించిన బీజేపీ.. రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లోనూ విజయం సాధించి హాట్రిక్ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 400 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కానీ.. దక్షిణాదిలో బలహీనంగా ఉన్న బీజేపీ అన్ని సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాదిన..
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 133 ఎంపీ స్థానాలున్నాయి. 2019లో దేశవ్యాప్తంగా మోదీ హవా కొనసాగినా.. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కలిపి బీజేపీకి వచ్చింది కేవలం 30 సీట్లే. ఒక్క కర్ణాటకలోనే బీజేపీ 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా… ఒక స్వతంత్ర అభ్యర్థికి కమలం పార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో మాత్రమే 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఏపీ, తమిళనాడు, కేరళలోని 84 స్థానాల్లో ఒక్క చోట కూడా బీజేపీ విజయం సాధించలేదు.
కర్ణాటక మినహా తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. ఒక్క చోట కూడా గెలవలేదు. బీజేపీ ధోరణి కారణంగా తమిళనాట మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే సైతం దూరమవుతూ వస్తోంది. దీనికితోడు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలతో గవర్నర్లకు వచ్చిన వివాదాలకు అధికార బీజేపీయే కారణమన్న అపవాదు మూటగట్టుకుంది. ఇవన్నీ బీజేపీకి మైనస్ అయ్యే అంశాలుగా మారాయి.
ఇక కర్ణాటకలో 25 సీట్లు గెలిచినా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడ బీజేపీ ప్రభావం తగ్గుతూ వస్తోంది. దీనికితోడు బీజేపీలోని గ్రూపు రాజకీయాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే పలువురు సిట్టింగ్ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అధిష్టానానికి తేల్చిచెప్పేశారు. బలంగా ఉన్నామనుకున్న రాష్ట్రంలో బీజేపీకి ఇది ఇబ్బందిగా మారింది. ఇక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిని హామీలను అమలు చేస్తూ.. దాన్ని లోక్‌సభ ఎన్నికలకు వాడుకునే అవకాశముంది. మొత్తంగా ఈసారి కర్ణాటకలో బీజేపీకి గతంలో వచ్చిన సీట్లలో సగం కూడా దక్కే అవకాశం లేకుండాపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. విభజన హామీల విషయంలో బీజేపీపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక జనసేనతో పొత్తు ఉన్నా.. అది ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదు. దీనికితోడు బీజేపీ తనకు అవసరమైనప్పుడు జగన్, చంద్రబాబుతో వేర్వేరుగా పనిచేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఏపీలో బీజేపీకి మైనస్ అయ్యే అంశాలే.
తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచినా.. పార్టీలో వర్గపోరు వచ్చే ఎన్నికల్లో కాస్త ఇబ్బందిగా మారే అవకాశముంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచి ఓటు బ్యాంకును పెంచుకున్న బీజేపీ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు తమకు కలిసివస్తాయని భావిస్తోంది. ఇక్కడ కనీసం 10 స్థానాల్లో గెలిస్తే.. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని చూస్తోంది. అటు ఏపీలో జగన్‌తోపాటు, చంద్రబాబుతోనూ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలో చెట్టాపట్టాలు వేసుకోవచ్చని భావిస్తోంది.
నార్త్ ఇండియాలో..
నార్త్ ఇండియాలో బీజేపీ ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నా.. పలు రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి సవాళ్లే ఎదురవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి స్థానిక పార్టీలు ఇబ్బందికరంగా మారాయి. పంజాబ్‌లో అకాలీదళ్, బీహార్‌లో జేడీయూ, రాజస్థాన్‌లో ఆర్‌ఎల్‌పీతో బీజేపీకి తెగదెంపులు కావడం ఇబ్బందిగా మారింది.
2019లో మహారాష్ట్ర, గోవాలో 48 స్థానాలకు గాను మిత్రపక్షమైన శివసేనతో కలిసి 44 చోట్ల విజయం సాధించింది బీజేపీ. అయితే.. మహారాష్ట్రలో చిరకాల మిత్ర పార్టీగా ఉన్న శివవసేన ఉద్దవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి వైరం మొదలైంది. దీనికితోడు కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్దవ్ వర్గం కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడి రోజురోజుకు బలపడుతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది. కేవలం రెండే సీట్లున్న గోవాలో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు.
అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. గత ఎన్నికల్లో యూపీలో 80 చోట్ల పోటీ చేసిన బీజేపీ.. 16 చోట్ల ఓటమిపాలైంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లలో గెలిచినా.. మిగతా 14 చోట్ల మాత్రం కమలం పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ చాలా సెగ్మెంట్లలో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉండటం బీజేపీకి ఇబ్బందిగా మారింది.
40 స్థానాలున్న బీహార్‌లో కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ బలహీనంగానే ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 17 చోట్ల గెలిస్తే.. జేడీయూ, ఎల్‌జేపీ, కాంగ్రెస్ పార్టీ మిగతా స్థానాల్లో విజయం సాధించాయి. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న నితీశ్‌కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీ కలిసికట్టుగా బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈసారి జేడీయూతో కలిసి పోటీ చేసేందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ సిద్ధం కావడం బీజేపీకి కాస్త ఇబ్బందిగా మారే అంశం.
ఇక పశ్చిమబెంగాల్‌లో బలంగా ఉన్న తృణముల్ కాంగ్రెస్.. ఇండియా కూటమిలో చేరింది. ఇక్కడ వామపక్షాలు కూడా ఈ అలయెన్స్‌లో కలవడంతో వీరి బలం పెరిగింది. గత ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ 18 స్థానాలు దక్కించుకుంటే.. తృణముల్ కాంగ్రెస్ 22 చోట్ల గెలుపొందింది. వామపక్ష భావజాలం ఎక్కువగా ఉన్న ఇక్కడ.. బీజేపీ హిందుత్వ నినాదం పెద్దగా పనిచేయదని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, అసోం వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉన్నా… అవన్నీ సిట్టింగ్ స్థానాలే. ఇక మిగతా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలన్నీ సింగిల్ డిజిట్‌లో ఉన్నవే. ఈ లెక్కన.. బీజేపీ అనుకున్న 400 లక్ష్యాన్ని చేరడం సంగతి పక్కన పెడితే.. గతంలో గెలిచిన సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఈ అంశాలపై చర్చలు