సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి అనేకరాష్ట్రాల బీజేపీని వ్యతిరేకించే నాయకులందరూ హాజరయ్యారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున అన్నీ పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపు 40 లక్షల మంది కార్యకర్తలు ఈ మీటింగ్ వచ్చే అవకాశమున్నట్లు తృణముల్ వర్గాలు తెలిపాయి.
మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్పీసీ అధినేత శరద్ పవార్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ తరపున మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, శరద్ యాదవ్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గిగోంగ్ అపాంగ్, గుజరాత్ ఎమ్మెల్యే జిఘ్నేష్ మేవాని తదితర నాయకులు హాజరయ్యారు. అయితే బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హా, బీజేపీ సీనియర్ నేతలు, మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిలు కూడా ప్రతిపక్షాల ర్యాలీకి హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్వరలో వీరిద్దరూ బీజేపీకి గుడ్ బాయ్ చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ర్యాలీలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ శౌరి. వేరే ఏ ప్రభుత్వం కూడా మోడీ సర్కార్ చెప్పినన్ని అబద్దాలు ప్రజలకు చెప్పలేదన్నారు.మోడీ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్నదే మధ్యప్రదేశ్ లో కూడా జరుగుతుందని అన్నారు.
ఈ ర్యాలీ కేవలం ఒక వ్యక్తిని గద్దె దించేందుకు కాదని, వారి ఐడియాలజీని ఓడించేందుకు తామంతా కలిసి ముందుకొచ్చినట్లు యశ్వంత్ సిన్హా తెలిపారు.
భారతీయ ప్రజలు మోడీ హయాంలో మతాల ఆధారంగా విభజించబడుతున్నారని ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. దేశాన్ని రక్షించేందుకే ప్రతిపక్షాలు ఏకం కావాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి బీజేపీదే బాధ్యత అని అన్నారు.