BJP MP Hema Malini
MP Hema Malini: బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ హేమామాలిని కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, లేకుంటే, ఎన్నికల పోటీ నుంచే తప్పుకుంటానని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం హేమామాలిని మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మథుర నియోజకవర్గం నుంచి ఆమె వరుసగా ఎంపీగా విజయం సాధించిన విషయం విధితమే.
Hema Malini : సాధారణ వ్యక్తిలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మెట్రో, ఆటో రిక్షా ప్రయాణం..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ హేమామాలిని పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచే నేను పోటీ చేస్తానని, వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన వచ్చినా అందుకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. నేను ఎన్నికల బరిలో నిలవాలని పార్టీ భావిస్తే నాకు సమస్య ఏమిటని అన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రజా ఉపయోగకర పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మోదీ పాలన పట్ల దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని హేమామాలిని దీమా వ్యక్తం చేశారు.
హేమామాలిని 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014 సంవత్సరంలో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ మథుర నియోజకవర్గం నుంచే బరిలోకిదిగి భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి, ఆర్డీఎల్ – ఎస్పీ కూటమి అభ్యర్థి నరేంద్ర సింగ్‌కు 3,76,399 ఓట్లు రాగా. హేమామాలినికి 6,64,291 ఓట్లు పోలయ్యాయి. వరుసగా రెండు సార్లు మథుర నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించడంతో.. మరోసారి కూడా మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని హేమామాలిని చెప్పారు.