BJP MP Saumitra Khan
BJP MP Saumitra Khan: స్వామి వివేకానంద పునర్జన్మ ఎత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగా జన్మించారని బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ ఎంపీ సౌమిత్రా ఖాన్ అన్నారు. నిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌమిత్రా ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘కొత్త రూపంలో ప్రధాని నరేంద్ర మోదీలా స్వామి వివేకానంద జన్మించారు. మాకు స్వామీజీ దేవుడితో సమానం. ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. తల్లిని కోల్పోయినప్పటికీ దేశం కోసం విధులు నిర్వర్తించారు. నవ భారతానికి అభినవ స్వామి వివేకానంద ఆయన’’ అని చెప్పారు.
దీంతో సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడ్డారు. ఖాన్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి, కోల్ కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ… ఆయన చేసిన వ్యాఖ్యలు స్వామి వివేకానందకు అవమానమని చెప్పారు. స్వామి వివేకానంద సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.
మోదీని వివేకానందుడితో పోల్చి బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఇటీవల బీజేపీ బిహార్ అధ్యక్షుడు నిత్యానంద రాయ్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మోదీలా స్వామి వివేకానంద పునర్జన్మ ఎత్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు, నిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు మోదీ నివాళులు అర్పించారు. వివేకానందుడి ఆదర్శాలు, ఆశయాలు భారతీయులను మార్గదర్శకాలని చెప్పారు.