Divorce Ruling
Bombay High Court: భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, అతడిని బహిరంగంగా అవమానించడం, మానసికంగా వేధించడం ముమ్మాటికీ క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. ఇలాంటి సందర్భాల్లో భార్యతో విడాకులు తీసుకునే హక్కు అతడికి ఉంటుందని స్పష్టం చేసింది.
పుణెకు చెందిన యువతీ, యువకుడు 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014లో వారి మధ్య విబేధాలు తలెత్తాయి. భార్య తనతో శృంగారానికి ఒప్పుకోవడం లేదు.. బంధువులు, స్నేహితుల ముందు నన్ను అవమానిస్తుంది, నా సోదరిని వేధిస్తోందని.. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఆ యువకుడు పుణె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో 2015లో ఫ్యామిలీ కోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యువకుడి భార్య బాంబే హైకోర్టులో పిటీషన్ వేసింది.
జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. తనతో శృంగారానికి నిరాకరించడంతోపాటు వివాహేతర సంబంధాలున్నాయని పదేపదే అనుమానించేదని సదరు భర్త పేర్కొన్నాడు. తనను విడిచి పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి అసలు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఇరు పక్షాల వాదనలువిన్న కోర్టు.. ఆమె పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
బంధువులు, స్నేహితుల ముందు భర్తను అవమానించడం, అతడితో శృంగారానికి ఒప్పుకోకపోవడం వంటివి అతడిని మానసికంగా తీవ్ర అశాంతికి గురిచేశాయని, దంపతులు ఇక కలిసి ఉండేందుకు ఆస్కారం లేదని పేర్కొంటూ వారికి విడాకులు మంజూరు చేయడమే సమంజసమని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.