ప్రజల హృదయాలు గెల్చుకున్న ప్రణవ్ : సీఎంకు కాలితో షేక్ హ్యాండ్..సెల్ఫీ

రెండు చేతులు లేవని ఆ యువకుడు ఎప్పుడూ బాధపడలేదు. చిన్నలోపం ఉంటేనే..దాని వల్ల తాము జీవితంలో ఎదగలేకపోతున్నామని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. కొందరైతే తమ ప్రాణాలను కూడా తీసుకుంటుంటారు.. కానీ అతడు మాత్రం తన వైకల్యాన్ని జయించాడు. అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. రెండు చేతులు లేని కేరళకు చెందిన ప్రవీణ్ అనే పెయింటర్…తన కాలినే చేతిగా చాచి సీఎం పినరయి విజయన్‌కు షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సెల్ఫీ దిగిన యువకుణ్ని కలవడం అమితమైన ఆనందాన్ని ఇచ్చిందంటూ సీఎం ఫొటోలను ట్వీట్ చేశారు. 

కేరళలోని అలతూర్‌కు చెందిన ప్రణవ్‌ బాలసుబ్రహ్మణ్యన్. అతడికి 21ఏళ్లు. పుట్టుకతో రెండు చేతులు లేవు. కానీ కాలితోనే పెయింటింగ్ వేస్తూ.. సత్తా చాటుతున్నాడు. చేతులు లేకపోయినా కాళ్లతోనే అద్భుతమైన చిత్రాలను గీసే ప్రణవ్ ఎందరో సెలబ్రిటీలకు వారి బొమ్మలను గీసి బహుమతులుగా ఇచ్చాడు. అందులో సచిన్ టెంటూల్కర్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ప్రణవ్ ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొని నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తాను గెలిచిన మొత్తాన్నీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం అసెంబ్లీకి వెళ్లిన ప్రణవ్.. సీఎంను కలిసి చెక్కును అందజేశారు. సీఎంకు ఇచ్చిన చెక్‌పై కాలి వేళ్లతో సంతకం చేసి ఇచ్చాడు. అంతేకాకుండా ఈ రోజు నా పుట్టినరోజు. మీతో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెక్ ఇచ్చిన తర్వాత సీఎంతో ప్రణవ్ అన్నాడు. ప్రణవ్ కాలితోనే మొబైల్ పట్టుకుని సీఎంతో సెల్ఫీ తీసుకున్నాడు. ముఖ్యమంత్రిపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన తనలాంటి వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుటారని ప్రణవ్ చెప్పుకొచ్చాడు. ప్రణవ్ గతంలో కూడా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. 2018లో కేరళ వరదల సమయంలోనూ రూ.5000 విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. 

ప్రణవ్ మంచి మనసుకు పినరయి విజయన్ ఫిదా అయిపోయారు. అతడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఫొటోలు దిగి ట్విట్టర్లో పోస్టు చేశారు.
ప్రణవ్  గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఫొటోలు దిగి ట్విట్టర్లో పోస్టు చేశారు సీఎం విజయన్. ఈ రోజు లెజిస్లేటివ్ కార్యాలయానికి రాగానే కలకాలం గుర్తుండిపోయే అనుభవం కలిగింది. అలాచూర్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు ప్రణవ్ తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు సాయం అందించేందుకు నా దగ్గరకు వచ్చాడు. అతడికి రెండు చేతులూ లేవు. టీవీ రియాలిటీ షోలో సంపాదించిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు  విరాళంగా ఇచ్చాడు. తనలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్న నమ్మకం ఉన్నట్లు ప్రణవ్‌ నాతో చెప్పాడు. అతడి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విజయన్ అన్నారు. ప్రణవ్ కాలితోనే మొబైల్ పట్టుకుని తనతో సెల్ఫీ తీసుకున్న తీరు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని విజయన్ తెలిపారు. ప్రణవ్‌ను కలిసిన నేపథ్యంలో అతడి కాలితోనే సీఎం విజయన్ కరచాలనం చేశారు. అలాగే ప్రణవ్ తన కాలితో చెక్కును అందిచగా దానిని సీఎం అందుకున్నారు.