TamilNadu: తమిళనాడు రాష్ట్రంలో ఓ ఇద్దరు పిల్లల తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా.. సాంబారు అన్నంలో విషంపెట్టింది. భర్త అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, కుటుంబ సభ్యులకు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీర్తెపట్టి గ్రామానికి చెందిన రసూల్ (43) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అమ్ముబి (35). వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అమ్ముబికి ఆమె ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న అవివాహితుడైన లోకేశ్వరన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను ఓ సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. వారి పరిచయంకాస్త స్నేహంగా మారి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వారిద్దరూ తరచూ గుట్టుగా కలుసుకునేవారు.
లోకేశ్వరన్ అమ్ముబి పేరును తన ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు. గత ఇరవైరోజుల క్రితం రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని భావించి రసూల్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారు.
అమ్ముబి లోకేశ్వరన్ ఇచ్చిన పురుగుల మందును సాంబారు అన్నంలో ఐదుసార్లు కలిపి తన భర్తకు ఇచ్చింది. పిల్లలు ఆ ఆహారం తినకపోవటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దాన్నితిన్న రసూల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. వైద్యులు పరీక్షించి తాను తిన్న ఆహారంలో విషం కలిసిందని గుర్తించారు. ఇదివిన్న రసూల్ షాక్ అయ్యాడు. తన భార్యపై అనుమానంతో .. తన తమ్ముడి భార్య ఆసినాతో అమ్ముబి ఫోన్ చెక్ చేయాలని సూచించాడు. దీంతో ఆమె అమ్ముబి ఫోన్ తనిఖీ చేయగా.. అమ్ముబి లోకేశ్వరన్‌తో తరచుగా మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు.
ఆమె వాట్సాప్ ను తనిఖీ చేయగా.. అమ్ముబి సంభాషణ ఆడియో వెలుగులోకి వచ్చింది. అమ్ముబి తన ప్రియుడు లోకేశ్వరన్‌తో.. తన భర్తకు నువ్వు ఇచ్చిన పురుగుల మందును ఆహారంలో కలిపానని చెప్పింది. దానిమ్మ రసంలో మందు కలిపినా అతను తాగలేదు. దీంతో సాంబారు అన్నంలో కలిపి ఇచ్చానని తెలిపింది. రసూల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబి, లోకేశ్వరన్‌ను అదుపులోకి అరెస్టు చేశారు. అమ్ముబి ఫోన్‌ను పోలీసులు తనిఖీ చేయగా.. లోకేశ్వరన్‌తో ఆమె ఒంటరిగా ఉన్న ఫొటోలను, వారు మాట్లాడుకున్న వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, రసూల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రసూల్ చనిపోయాడు. లోకేశ్వరన్, అమ్ముబిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.