మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. దేశ వ్యాప్తంగా కులగణన..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరిగింది.

Union minister Ashwini Vaishnaw

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని నిర్ణయించింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందని చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ క్యాబినెట్‌లో తీసుకున్న వివరాలు తెలిపారు.

దేశ వ్యాప్తంగా కులగణన చేయించాలని చాలా కాలంగా డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేశారు. దీనిపై కూడా అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఆ రాష్ట్రాల్లో జరిపిన సర్వేల్లో పారదర్శకత లేదన్నారు.

Also Read: టెన్త్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్నారా? ఇలా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయించుకోండి..

“వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఇవాళ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కుల గణనను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2010లో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణనపై నిర్ణయం తీసుకోవాల్సింది క్యాబినెట్‌లోనని అన్నారు. కులగణనపై మంత్రుల బృందం ఏర్పడింది. ఇందులో చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫారసు చేశాయి” అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్, దాని ఇండియా కూటమిలోని పార్టీలు కులగణనను కేవలం రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడానికి సర్వేలు బాగానే నిర్వహించాయని, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకతలేని విధంగా రాజకీయ కోణం నుంచి మాత్రమే సర్వేలు నిర్వహించాయని తెలిపారు.

ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను సృష్టించాయని అన్నారు. మన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా చూసుకోవడానికి అటువంటి సర్వేలకు బదులుగా కులగణనను జనాభా గణనలో చేర్చాల్సి ఉందని తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం.. జనాభా లెక్కల అంశం 7వ షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో 69 నంబరులో ఉందని తెలిపారు. దీంతో కేంద్ర సబ్జెక్ట్‌గా ఉందని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు కుల ఆధారిత సర్వేలను నిర్వహించినప్పటికీ, ఈ సర్వేలను వివిధ విధానాల్లో చేశారని చెప్పారు. కొన్ని సర్వేలను పారదర్శకంగా, వ్యవస్థీకృత పద్ధతిలో చేశారని అన్నారు.

మరికొన్నింటిని రాజకీయ ప్రయోజనాల కోసం చేశారని తెలిపారు. పారదర్శకత లేకపోవడంతో అవి సమాజంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఇటువంటి అస్థిరమైన ప్రయత్నాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సామాజిక నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవడానికి అధికారిక జనాభా లెక్కింపులో భాగంగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.