శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీ,ఉద్దవ్ ఠాక్రేల మధ్య ఈ ఒప్పందం జరిగిందన్నారు.
అయితే ఫడ్నవీస్ చెప్పినట్లు తామెప్పుడూ మోడీ,అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని,శివసేన సీఎం మహారాష్ట్రలో ఉంటారన్నారు. శివసేన,తనపై ఫడ్నవీస్ చేసిన కామెంట్స్ పై ఉద్దవ్ ఠాక్రే ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
గత నెల 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఇవాళ(నవంబర్-8,2019)తో ముగుస్తుంది. దీంతో ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు.