భారత పౌరసత్వానికి ఆ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.. స్పష్టం చేసిన కేంద్రం

జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరత్వం నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Indian citizenship

Central Government: ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు భారత పౌరసత్వానికి ధ్రువీకరణ కావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరత్వం నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ -1969 ప్రకారం.. సంబంధిత అధికార యంత్రాంగం జారీచేసే జనన ధ్రువీకరణ పత్రం, భారతదేశంలో జన్మించినట్లుగా పేర్కొనే హక్కు ఆధారంగా పౌరసత్వాన్ని ధ్రువీకరిస్తుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఒక వ్యక్తి నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో నివసిస్తున్నట్లు ధ్రువీకరించే నివాస పత్రం కూడా పౌరసత్వ నిర్ధారణకు కీలకమైన ఆధారంగా పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Also Read: Watch Video: 14వేల గొర్రెలతో వెళ్తున్న షిప్.. ఎర్ర సముద్రంలో సడన్ గా మునక… గొర్రెలను ఎలా కాపాడుతున్నారో చూడండి..

ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు కేవలం గుర్తింపు, చిరునామా నిర్దారణ, పన్ను చెల్లింపు, సంక్షేమ పథకాల లబ్ధి వంటి పరిపాలనాపరమైన అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, కొద్దికాలంగా అనేక మంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఆధార్, రేషన్, పాన్ కార్డులు పొంది సిటిజన్ షిప్ కోసం అప్లికేషన్లు చేసుకుంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ సూచనలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. ఒకవేళ బర్త్ సర్టిఫికెట్ లేనివారు భారత పౌరసత్వం పొందడానికి నివాస ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

 

ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్ పోర్టు జారీ లేదా ఇతర చట్టపరమైన అవసరాల సమయంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భాల్లో జనన, నివాస ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండటం ఎంతో అవసరం. అవిలేని వారు సంబంధిత మున్సిపల్ లేదా రాష్ట్ర అధికారుల ద్వారా వీటిని పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.