కోల్ కతా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రముఖ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మధ్యంత బడ్జెట్ ఎన్నికల తాయిలంలా ఉందని కొందరు నేతలు..మా రాష్ట్రం పథకాలనే కేంద్రం కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర బడ్జెట్ పై తనదైన శైలిలో స్పందించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని..ఈ బడ్జెట్ కు సంబంధించి స్కిల్ డెవలప్ మెంట్ సెక్టార్ లో కోతలు విధించారని విమర్శించారు. పథకాలనే కాపీ కొట్టిందని..పశ్చిమబెంగాల్ లో తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కొత్తగా ప్రకటించిందని విమర్శించారు. కేంద్ర పథకం అని చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’, పశ్చిమ బెంగాల్ లో ముందు నుంచే అమల్లో ఉందని, ఆరోగ్య పథకం కింద రూ.5 లక్షల వరకు అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్ర ప్రభుత్వం తమ గొప్పలుగా చెప్పుకుంటోందని, మోదీ ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దుయ్యబట్టారు.