చారిత్రాత్మక నిత్యావసరాల చట్ట సవరణ(ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో మొత్తం ఆరు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని,ఇందులో 3వ్యవసాయానికి,రైతులకు సంబంధించినవని జావదేకర్ తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రైతుల పంట ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు చెప్పారు. దేశంలో రైతులు ఇప్పుడు ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకోవచ్చునన్నారు.
రైతులకు ఇవాళ చరిత్రాత్మక దినం అని…వన్ నేషన్ వన్ మార్కెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. కష్టసమయంలో రైతులకు,వ్యాపారులకు అండగా ఉంటామన్న ఆయన… మార్కెట్ వ్యాపారం చేసుకునేందుకు మరిన్ని లైసెన్స్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా ఆన్ లైన్ లో వ్యాపార లైసెన్స్ లు ఇస్తామన్నారు.
కోల్ కతా పోర్ట్ ట్రస్టు పేరును శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ గా మార్పు చేసినట్లు జావదేకర్ తెలిపారు. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రిత్వశాఖలు లేదా డిపార్ట్మెంట్ లలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్(EGoS)&ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ సెల్స్(PDCs)ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాష్ జావదేకర్ తెలిపారు