Universal Pension Scheme : కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన స్కీమ్ ను తీసుకురానుందా? దేశంలో అందరికీ పెన్షన్ ఇవ్వనుందా? ఇప్పుడీ అంశం ఆసక్తికరంగా మారింది. దేశంలోని పౌరులందరికీ (60 ఏళ్లు పైబడిన వారందరికీ) వర్తించేలా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సామాజిక భద్రత పథకానికి నోచుకోని అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారందరికీ ప్రయోజనం కల్పించేలా పెన్షన్ స్కీమ్ కు ప్లాన్ చేస్తోంది కేంద్రం.
యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గేమ్ ఛేంజర్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి సామాజిక భద్రతా పథకానికి నోచుకోని భవన నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్స్ వంటి వారికి ప్రయోజనం చేకూరేలా ఈ పెన్షన్ స్కీమ్ ఉండనుందట. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే ఏ పెద్ద పొదుపు పథకాల పరిధిలోకి వీరు రారు. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ వల్ల వీరికి ప్రయోజనం చేకూరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పసిడి ధర తక్కువ గురూ.. కొనేస్తారా?
ఈ పథకం స్వచ్ఛందంగా ఉంటుంది. ఎవరైనా పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం ఈ స్కీమ్‌లో చేరొచ్చట. అంటే.. స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ప్రారంభమైందని, త్వరలోనే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఉన్న కొత్త పెన్షన్ సిస్టమ్ (NPS) 18-70 సంవత్సరాల మధ్య వయస్సు గల విదేశాలలో నివసిస్తున్న వారితో సహా భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంది. కార్పొరేట్లు కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. దాని ప్రయోజనాలను ఉద్యోగులకు విస్తరించవచ్చు.
కేంద్రం ఇప్పటికే ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM) రన్ చేస్తోంది. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం జాతీయ పెన్షన్ పథకం (NPS-ట్రేడర్స్)లను ఈ కొత్త పథకంలో విలీనం చేయవచ్చు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి. వీటిలో, 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా రూ3,000 పెన్షన్ పొందుతారు. దీని కోసం ప్రతి నెల రూ. 55 నుండి రూ. 200 వరకు డిపాజిట్ చేయాలి.
Also Read : ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి? దీని వల్ల అక్కడున్న ఇండియన్స్ కి వచ్చే నష్టం ఏంటి?
అసంఘటిత రంగంలో పని చేస్తూ.. ఎలాంటి పెన్షన్ పథకాలకు నోచుకోని వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌దాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తే.. ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇన్ని పథకాలు వేర్వేరుగా ఉండే బదులు.. దేశంలోని పౌరులందరికీ ఒకే తరహా పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పొదుపు, పింఛను పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.