Shivraj Chouhan: హమ్మయ్య.. ఎట్టకేలకు సీఎంకు టిక్కెట్ ఇచ్చిన బీజేపీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీపై ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తాజాగా విడుదల చేసిన 4వ జాబితాలో ఆయన పేరు ఉంది.

Chief Minister Shivraj Chouhan in BJP 4th candidates list for Madhya Pradesh
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎట్టకేలకు టిక్కెట్ ఖరారైంది. నాలుగో లిస్ట్ లో ఆయన అభ్యర్దిత్వాన్ని ఖరారు చేశారు. తనకు బలమైన కోటగా పేరుగాంచిన బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 57 మంది అభ్యర్థులతో సోమవారం బీజేపీ 4వ జాబితా విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో సీఎం చౌహాన్ పోటీ చేయబోరంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి తాజా జాబితాలో తెర పడింది.
రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. దాతియా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆయన గెలుపొందారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు కాపాడుకున్నారు. విశ్వాస్ సారంగ్, రామేశ్వర్ శర్మ, కృష్ణ గౌర్, విష్ణు ఖత్రి.. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయనున్నారు. సీనియర్ బీజేపీ నేతలు ప్రధుమన్ తోమర్, గోవింద్ రాజ్‌పుత్, ప్రభురామ్ చౌదరి, హర్దీప్ సింగ్ డాంగ్, బిసాహులాల్ సింగ్ కూడా టికెట్లు దక్కించుకున్న వారిలో ఉన్నారు.
ఇప్పటివరకు 136 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, మధ్యప్రదేశ్ ప్రజలు తమకే పట్టం కడతారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ అధికార పార్టీగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని తిరిగి వచ్చినప్పుడు మినహా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2020 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది.
Also Read: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై స్పందించిన ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ