Justice Sanjiv Khanna, and CJI DY Chandrachud
Justice Sanjiv Khanna: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కొనసాగుతున్నారు. 2022 నవంబర్ 9వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మరో నెల రోజుల్లో చంద్రచూడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. సంప్రదాయం ప్రకారం రెండవ అత్యుంత సీనియర్ న్యాయమూర్తిని తన వారసుడిగా నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో చంద్రచూడ్ తన తరువాత సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు.
Also Read: వీళ్లు ఏపీకి, వాళ్లు తెలంగాణకు.. హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అవుతున్న ఐఏఎస్‌లు..
నిబంధనలు ఇలా..
నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ చంద్రచూడ్ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదిస్తారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలనకోసం పంపనుంది. ప్రధాని ఆమోదం తరువాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. చివరకు రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. చంద్రచూడ్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులు కానున్నారు. జస్టిన్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ముగిసిన మరుసటిరోజు జస్టిస్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఖన్నా ఈ పదవిలో కొనసాగుతారు.
Also Read: KTR: అయినను పోయి రావాలె..! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు..
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..?
⇒ జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
⇒ తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీస్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు.
⇒ 2004లో ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలందించారు.
⇒ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ కేసులలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమికస్ క్యూరీగా కొనసాగారు.
⇒ 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
⇒ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్ గా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్ ఛార్జిగా కొనసాగారు.
⇒ 2019 జనవరి 18వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.
⇒ ప్రస్తుతం అతను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యుటీవ్ చైర్మన్ గా.. భోపాల్ లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
⇒ ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 తొలగింపు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు సంబంధిత కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా పాత్ర కీలకమైంది.