School student
Maharashtra : బాలల దినోత్సవం రోజున స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కు విద్యార్థిని మృతిచెందింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని వసాయిలోని శ్రీ హనుమంత్ విద్యామందిర్ హైస్కూల్లో కాజల్ గోండ్ 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా స్కూల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కాజల్ పాఠశాలకు 10నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక కఠినమైన పనిష్మెంట్ ఇచ్చింది.
బ్యాగు వేసుకుని 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. దీంతో కాజల్ గోండ్ టీచర్ చెప్పినట్లు గుంజీలు తీసింది. గుంజీలు తీసిన తర్వాత ఇంటికి చేరుకున్న కాజల్ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె పేరెంట్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
గుంజీలు తీయించడం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి బంధువులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తల్లిదండ్రులు, స్థానికుల్లో ఆగ్రహానికి దారితీసింది. వారు ఉపాధ్యాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసే వరకు పాఠశాలను తిరిగి తెరవడానికి అనుమతించబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) హెచ్చరించింది.