Karnataka Politics: నో డౌట్.. ఐదేళ్లు నేనే సీఎం..! కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారానికి తెర..

సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నెలకొంటాయని కర్నాటక మంత్రి రాజన్న కూడా ఈ మధ్య అన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది.

Karnataka Politics: కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ఐదేళ్లు తానే కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు సిద్ధరామయ్యా. సీఎం మార్పు అంశం కొన్ని రోజులుగా కర్నాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం అవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విపక్షాలు బీజేపీ, జేడీఎస్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ వస్తున్నాయి.

ఈ పరిణామాలపై ఇప్పటికే డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ తనకు మద్దతుగా మాట్లాడరాదన్నారు. హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవాలని, కాదని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు డీకే శివకుమార్. నాయకత్వ మార్పు ఉండదని తేల్చి చెప్పారాయన. సీఎం సిద్ధరామయ్యకు అండగా ఉండటం తప్ప తనకు వేరే ఆప్షన్స్ లేవని, అధిష్టానం ఏం చెబితే అదే చేయాలని అన్నారు. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. డీకే శివకుమార్ సీఎం అవుతారని అన్నారు. దాంతో ఒక్కసారి రచ్చ రాజుకుంది.

మరో రెండు మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నెలకొంటాయని కర్నాటక మంత్రి రాజన్న కూడా ఈ మధ్య అన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది.

Also Read: వారసుడి ఎంపికపై దలైలామా సంచలన ప్రకటన.. చైనా వాదన ఏంటి? టిబెట్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారన్న వార్తలు వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తప్పించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.