కొత్త రూల్…పక్క సీట్లలో కూర్చొనే మహిళలతో ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడకూడదు

సాధారణంగా మనం ఆర్టీసీ బస్సు ఎక్కగానే అందులో…. మ‌హిళ‌ల‌ను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్ల‌లో వారినే కూర్చోనివ్వండి అని  రాసి ఉండ‌డాన్ని చూస్తుంటాం. అలాగే  మ‌హిళ‌లు ఎక్క‌డ గౌర‌వించ‌బ‌డుతారో అక్క‌డ దేవ‌త‌లు ఉంటారు. కావున వారిని గౌర‌విద్దాం అని కూడా ఆర్టీసీ బ‌స్సుల్లో రాసిన వాటిని అనేక సార్లు చ‌దివే ఉంటాం. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఇచ్చే గౌర‌వం అలాంటిది.

అయితే  త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబ‌త్తూరు ఆర్టీసీ రీజియన్ ప‌రిధిలో సంబంధిత అధికారులు ఓ విచిత్ర‌మైన నిబంధ‌న‌ విధించారు. ఆ నిబంధ‌న‌ కూడా డ్రైవ‌ర్ల‌కు మాత్రమే. ఇప్పుడు ఆ నిబంధ‌న‌పై దేశవ్యాప్తంగా,సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ అక్కడి అధికారులు విధించిన ఆ నిబంధన ఏంటనుకుంటున్నారా?

ఆర్టీసీ బస్సుల్లోడ్రైవ‌ర్ల‌కు పక్కనే ఉన్న సీట్ల‌లో మ‌హిళ‌లు కూర్చుంటే వారితో వాహ‌నం న‌డిపే వాళ్లు మాట్లాడ‌కూడ‌ద‌ని నిబంధ‌న విధించారు. అసలేందుకు ఈ నిబంధ‌న అని కోయంబ‌త్తూరు ఆర్టీసీ  అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా…మ‌హిళ‌ల‌తో మాట్లాడుతూ బ‌స్సు న‌డుపుతుండ‌టం వ‌ల్ల డ్రైవింగ్‌పై ఏకాగ్ర‌త కొర‌వ‌డి, వేరే లోకంలో విహ‌రిస్తూ ప్ర‌మాదాలు చేస్తున్నార‌నే ఫిర్యాదులు త‌మ‌కు అందాయంటున్నారు.

డ్రైవ‌ర్లు ప‌ర‌ధ్యానంతో బ‌స్సులు న‌డుపుతూ ప్రాణాలు తీస్తున్నార‌ని ఆర్టీసీ అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందువ‌ల్లే ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని కోయంబ‌త్తూరు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ నిబంధ‌న అతిక్ర‌మించే డ్రైవ‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామంటున్నారు అధికారులు. మరోవైపు ఈ నిబంధనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది.