Amitabh and Akshay : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లు రియల్ హీరోలు కాదంటూ..మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా బాలీవుడ్ నటులు స్పందించడం లేదంటూ..ఆగ్రహం వ్యక్తం చేశారాయన. డిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున భండార జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో వారు జనపక్షం వహిస్తే బాగుండదనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. వారికి వ్యతిరేకంగా..తానేమీ మాట్లాడబోనని, వారి వైఖరి పట్ల స్పందిస్తున్నట్లు పటేల్ తెలిపారు. వారిద్దరి సినిమాలు విడుదలైతే..కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతామన్నారు.
గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగితే..ట్వీట్లు చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ నిలదీశారు. ప్రజస్వామ్య వ్యవస్థలో ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే ఇలాంటి సెలబ్రిటీలు ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం వారి బాధ్యతగా భావించాలన్నారు.
గత కొన్ని రోజులుగా చమురు ధరలు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 12వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. రికార్డు స్థాయికి ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనం బయటకు తియ్యాలంటేనే జంకుతున్నారు.