అందుకే బీజేపీ అధికారంలో..కాంగ్రెస్ ప్రతిపక్షంలో

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్​ సీనియర్ లీడర్,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్​. పోలీసుల చర్య అత్యంత అమానవీయమని తెలిపారు.దేశంలోని అన్ని విపక్ష పార్టీల తరపున తమ గళాన్ని వినిపిస్తున్నామని తెలిపారు. ఈసందర్భంగా కేంద్రప్రభుత్వం,ఢిల్లీ పోలీసులపై ఆజాద్ విమర్శలు గుప్పించారు.

సోమవారం(డిసెంబర్-16,2019)ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్ష పార్టీలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ…నిన్న ఢిల్లీలోని యూనివర్సిటీలో ఘటనలే కాదు.. అంతకు ముందు నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరసత్వ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందడానికి ముందు నుంచి నిరసనలు చెలరేగాయి. పోలీసులు వర్శిటీ క్యాంపస్ లో ప్రవేశించిన తీరు, లైబ్రరీ మొదలు, బాత్ రూమ్​ల వరకు వెళ్లి విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్రస్థాయిలో ఖండించాల్సిన విషయమని ఆజాద్ తెలిపారు.

యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీసులు వర్శిటీ లోపలికి ఎలా వస్తారు? దీనిపై జుడీషియల్ విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఆజాద్ అన్నారు. ఆందోళనల వెనక కాంగ్రెస్​ ఉందని ప్రధాని చెప్పారని, కాంగ్రెస్​కు హింసను ప్రేరేపించే సామర్థ్యం ఉంటే.. బీజేపీ అధికారంలో ఉండేది కాదన్నారు. అది నిరాధారమైన ఆరోపణ అని ఆజాద్ తెలిపారు. ప్రధాని, హోంమంత్రి, వారి కేబినేట్​ దీనికి బాధ్యత వహించాలని ఆజాద్ అన్నారు.