పాటీదార్ ఉద్యమనేత, కాంగ్రెస్ లీడర్ హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని సురేంద్రనగర్ లో జన్ ఆక్రోశ్ సభలో మాట్లాడుతున్న హార్ధిక్ పటేల్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి అందరూ చూస్తుండగా చెంప చెల్లుమనిపించాడు. జన్ ఆక్రోశ్ సభలో హార్ధిక్ పటేల్ మాట్లాడుతున్న సమయంలోనే అక్కడకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి హార్ధిక్ పటేల్ పై దాడి చేశాడు. దీంతో హార్ధిక్ పటేల్ దవడ అదిరింది. ఊహించని పరిణామంతో హార్ధిక్ పటేల్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్
వచ్చిన వ్యక్తి కొట్టిన తర్వాత హార్ధిక్ పటేల్ ను తిడుతూ అక్కడి నుంచి నెట్టేసే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతనిని పట్టుకొని కొట్టారు. కార్యకర్తల దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఘటన అనంతరం హార్ధిక్ తన ప్రసంగాన్ని కొనసాగించగా.. తనను భయపెట్టడానికి బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతుందిని ఆరోపించారు. బీజేపీ నేతలే హార్ధిక్ పై దాడి చేయించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎంతోకాలంగా పాటీదార్ ఉద్యమనేతగా ఉన్న హార్ధిక్ ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ లీడర్ జీవీఎల్ పై దాడి జరిగిన ఒక్క రోజు తర్వాతే ఈ ఘటన జరగడం విశేషం.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?