ఈసీ కార్యాలయంకు ర్యాలీగా విపక్ష ఎంపీలు.. అడ్డుకున్న పోలీసులు.. బారికేడ్లు ఎక్కిన ఎంపీలు.. ఉద్రిక్తత.. రాహుల్‌సహా పలువురు అరెస్టు

బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఎన్నిలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

Rahul Gandhi

Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీతో కుమ్మక్కయ్యిందని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పార్లమెంటు భవనం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేశ్ యాదవ్, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ సహా ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు.


ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంసద్ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ రహదారిని బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఖిలేశ్ యాదవ్ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. విపక్ష నేతలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో అక్కడి నుంచి తరలించారు.


ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోరాటం రాజకీయమైంది కాదు. ఇది రాజ్యాంగాన్ని కాపాడటం కోసం చేస్తున్న పోరాటం. ఒక వ్యక్తి.. ఒక ఓటు కోసం జరుగుతున్న పోరాటం. వాస్తవం ఏమిటంటే వారు (బీజేపీ ప్రభుత్వం) మాట్లాడలేరు.. నిజం దేశం ముందు ఉంది అంటూ రాహుల్ అన్నారు.


ఎంపీల అరెస్టుపై జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీస్ దీపక్ పురోహిత్ మాట్లాడుతూ.. నిరసన ప్రదర్శన కోసం ప్రతిపక్షాలకు అనుమతి లేదు. కేవలం 30 మంది ఎంపీల బృందం మాత్రమే ఎన్నికల కమిషన్ కార్యాలయంకు వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ, 200 మందికిపైగా నిరసన ప్రదర్శనగా ఈసీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. అదుపులోకి తీసుకున్న ఎంపీలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

బీహార్ సమగ్ర సవరణ (బీహార్ సర్) సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈసీకి లేఖ రాశారు. ఇందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాలతో భేటీకి అంగీకరించింది. 30మంది విపక్ష ఎంపీలు మాత్రమే సమావేశానికి రావాలని చెబుతూ సోమవారం మధ్యాహ్నానికి అపాయింట్ మెంట్ ఇచ్చింది. అయితే, విపక్ష ఎంపీలు భారీ సంఖ్యలో ర్యాలీగా ఈసీ కార్యాలయంవైపు నిరసనగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.