Mahatma Gandhi : మహాత్మగాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం..!

అహింస మార్గంలో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మగాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్

Gandhi

Congressional Gold Medal : అహింస మార్గంలో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మగాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని అక్కడి ప్రముఖ చట్టసభ సభ్యుడు కరోలిన్ బి.మాలోనీ ప్రతిపాదించారు. ఈ మేరకు దిగువ సభ ప్రతినిధుల సభలో తీర్మానాన్ని పున:ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ గాంధీ అనుసరించిన అహింస, సత్యాగ్రహ మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు, ప్రముఖల్లో స్ఫూర్తి నింపాయని తెలిపారు.

ఇతరులకు సేవ చేయడంలో నిమగ్నమవ్వాలనే శక్తిని మనలో నింపుతుందన్నారు. వర్ణ సమానత్వం కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా వరకు ప్రతి ఒక్కరినీ కదిలించిందన్నారు. ప్రజా ప్రతినిధిగా గాంధీ ఆదర్శనాల నుంచి తాను ప్రతిరోజూ స్ఫూర్తి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును ముందు మనలోనే చూద్దామన్న గాంధీ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు.

అమెరికా గాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ను ప్రకటించినట్లైతే ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయుడు ఆయనే అవుతారు. ఈ అత్యున్న పురస్కారం అందుకున్న వారిలో జార్జ్ వాషింగ్టన్, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్, మదర్ థెరిస్సా, రోసా పార్క్స్ ఉన్నారు. భారత్ కు స్వాతంత్ర్యం లభించి 75 వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికా చట్టసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.