Vaccination : చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా.. వైద్య సిబ్బంది సస్పెండ్

చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా రెండో డోస్ వేసినట్లు మొబైల్ కి సందేశం రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.

Vaccination

Vaccination : చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా రెండో డోస్ వేసినట్లు మొబైల్ కి సందేశం రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కి.. వైద్య సిబ్బంది సస్పెండ్ కి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం బనస్కాంతలోని పాలన్‌పూర్‌ పట్టణానికి చెందిన ముఖేష్ జోషి మూడు నెలల కిందట కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

ఆ తర్వాత కొద్దీ రోజులకు ఇతర కారణాలతో మృతి చెందారు. ఆయన ఫోన్ ఇంట్లో వారు వాడుతున్నారు. తాజాగా ఆ ఫోన్ కి ముఖేష్ జోషి రెండవ డోస్ కరోనా టీకా తీసుకున్నట్లుగా సందేశం వచ్చింది. చనిపోయిన వ్యక్తికి టీకా రెండో డోస్ ఎలా వేశారంటూ నోరెళ్లబెట్టారు.

ఈ విషయం అధికారుల దృష్టిలో వెళ్లడంతో దీనిపై విచారణ చేపట్టారు. వివరాల నమోదులో పొరపాటు దొర్లినట్లు తేల్చారు. వ్యాక్సిన్ పొందిన వ్యక్తికి బదులుగా మరణించిన వ్యక్తి ఫోన్ నంబర్ ను ఆరోగ్య కార్యకర్త తప్పుగా నమోదు చేసినట్లు బనస్కాంత ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జిగ్నేష్ హర్యానీ తెలిపారు.

ఈ ఘటనపై విచారణ జరిపి దీనికి కారణమైన సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఎటువంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.