డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ తో ఎలాంటి ప్రయోజనం లేదు, ఆ రసాయనంతో కరోనా చావదు, పైగా హానికరం

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 05:28 AM IST
డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ తో ఎలాంటి ప్రయోజనం లేదు, ఆ రసాయనంతో కరోనా చావదు, పైగా హానికరం

Updated On : April 21, 2020 / 5:28 AM IST

డిసిన్ఫెక్షన్ టన్నెల్స్(disinfectant tunnel) లేదా శానిటేజేషన్ టన్నెల్స్(sanitisation tunnel).. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయి. డిసిన్ఫెక్షన్ టన్నెల్ అంటే.. ఓ గుహ లేదా డబ్బా ఆకారంలో ఉంటుంది. ఇందులో సూక్ష్మజీవుల సంహారక రసాయనాలు పిచికారీ అవుతుంటాయి. వ్యక్తులు చేతులను పైకెత్తి ఆ టన్నెల్స్ లో మూడు నుంచి ఐదు సెకన్ల పాటు అందులో నిలబడితే చాలు. అందులో నుంచి కెమికల్ స్ప్రే అవుతుంది. ఆ స్ప్రే దెబ్బకు శరీరంపై ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే ఇట్టె చనిపోతుంది. సెకన్ల వ్యవధిలో శరీరంపై ఉన్న క్రిములను ఈ టన్నెల్ కడిగేస్తుంది. ఈ టన్నెల్ లో 3 సెకన్లు నిలబడితే చాలు.. కరోనా వైరస్ చచ్చిపోతుంది. ఇదీ ఇప్పటివరకు ఉన్న ప్రచారం, నమ్మకం. దీన్ని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నమ్మాయి. 

జన సందోహం ఉన్న ప్రాంతాల్లో డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ ఏర్పాటు:
అంతేకాదు.. పెద్ద సంఖ్యలో జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ టన్నెల్స్ ఏర్పాటు చేశాయి. ప్రధానంగా మార్కెట్లలో ఉంచారు. మార్కెట్ కు వచ్చే వ్యక్తులు ఈ టన్నెల్ ద్వారా రావాల్సి ఉంటుంది. ఇక ఇందులో వాడే రసాయనం ఏంటో తెలుసా? సోడియం హైపోక్లోరైట్(sodium hypochlorite). దీన్ని డిస్‌ ఇన్‌ఫెక్టంట్ గా వాడతారు. టన్నెల్స్ దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరంపై ఏమైనా క్రిములు ఉన్నా లేదా కరోనా వైరస్ ఉన్నా చచ్చిపోతుందని అధికారులు సహా అంతా నమ్ముతున్నారు.

డిసిన్ఫెక్షన్ లేదా శానిటైజేషన్ టన్నెల్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు:
దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ లేదా శానిటైజేషన్ టన్నెల్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చింది. కరోనా వైరస్ చావదని స్పష్టం చేసింది. పైగా మనుషులకు చాలా హానికరం అని స్పష్టం చేసింది. కళ్లు, ముక్కు, శరీరంపై ఆ కెమికల్ తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

వ్యక్తులపై రసాయనాల స్ప్రే హానికరం.. కొత్త రోగాలు ఖాయం:
కరోనా నివారణ ముందు జాగ్రత్త చర్యల కోసం వ్యాధి కారక బ్యాక్టీరియాను నాశనం చేసే సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాల (డిస్‌ఇన్‌ఫెక్టంట్స్)ను మనుషులపై స్ప్రే చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా అనుమానితులు లేదా కరోనా నిర్ధారణ రోగులు తరచుగా స్పర్శించే ఉపరితలాలు, ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి మాత్రమే ఈ రసాయనాలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. పరిశుభ్రం చేయడానికి ఈ రసాయనాలు ఉపయోగించేటప్పుడు గ్లోవ్స్ వంటివి ధరించాలని సూచించింది. వ్యక్తులపై విడిగా, లేదా గుంపుల వారీగా సోడియం హైపోక్లోరైట్ రసాయనం స్ప్రే చేస్తే భౌతికంగా, మానసికంగా హాని కలుగుతుందని హెచ్చరించింది. వ్యక్తులపై క్లోరిన్ స్ప్రే చేస్తే కళ్లు, చర్మం మండుతాయని, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోడియం హైపోక్లోరైట్‌ను పీలిస్తే గొంతు, ముక్కు శ్వాస నాళం లోని పొరల్లో మంట పుడుతుందని వివరించింది.

సోడియం హైపోక్లోరైట్ మనుషులపై చల్లడాన్ని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయలేదు:
ర‌సాయ‌నిక మందులు కానీ, క్రిమి సంహార‌కాలను కానీ.. వ్య‌క్తుల‌పై కానీ లేక ఏదైనా స‌మూహంపై చ‌ల్ల‌డం నేర‌మ‌వుతుంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది. అలా స్ప్రే చేయ‌డం వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా హాని క‌లుగుతుంద‌ని తేల్చింది. కోవిడ్-‌19 నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ అడ్వైజ‌రీ రిలీజ్ చేసింది. డిస్ఇన్‌ఫెక్ష‌న్ కోసం ర‌సాయ‌నాలు చ‌ల్ల‌డాన్ని ప్ర‌భుత్వం సిఫార‌సు చేయ‌లేద‌ని ఆరోగ్య‌శాఖ చెప్పింది. సోడియం హైపోక్లోరైట్ లాంటి ర‌సాయ‌నాల‌ను చ‌ల్లాలా వ‌ద్దా అన్న ప్ర‌శ్న‌ల‌ను ప్ర‌జ‌లు లేవ‌నెత్తుతున్నార‌ని, అయితే ఆ ర‌సాయ‌నాన్ని పీల్చ‌డం వ‌ల్ల ముక్కుల్లో ఇరిటేష‌న్ వ‌స్తుంద‌ని ఆరోగ్య‌శాఖ పేర్కొంది. గొంతు, శ్వాస‌ కోస ఇబ్బందులు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఆ రసాయనం వల్ల కరోనా వైరస్ చావడం మాటేమో కానీ.. కొత్త సమస్యలు రావడం ఖాయమని కేంద్ర ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది.

డిసిన్ఫెక్షన్ లేదా శానిటైజేషన్ టన్నెల్ ఇలా పని చేస్తుంది:
కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో డిసిన్ఫెక్షన్ లేదా శానిటైజేషన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తాత్కాలిక సేఫ్‌ టన్నెల్స్ గా విశ్వసిస్తున్నారు. రూ.30వేల ఖర్చుతో ఈ తాత్కాలిక టన్నెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గుహ ఆకారాన్ని పోలినట్టుగా వస్త్రాలతో బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దానికి రెండు వైపులా శుభకార్యాల్లో పన్నీరును చల్లే యంత్రాలను అమర్చుతారు. వాటికి అనుబంధంగా ఒక పెద్ద డబ్బాలో బెటాడిన్‌, సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాలు కలిపిన మిశ్రమాన్ని పోస్తారు. అందులో నుంచి ఒక పైపును ఈ యంత్రాలకు కలుపుతారు. ఈ మోటార్లు తిరుగుతున్నప్పుడు ఈ రసాయనాల మిశ్రమం జల్లు రూపంలో బయటకు వస్తుంది. ఈ జల్లులో 20 సెకన్ల పాటు నిలబడితే దుస్తులు, శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయని అంతా నమ్ముతున్నారు.