Partha Chatterjee
Teacher Recruitment Scam :ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ (Enforcement Directorate) అరెస్టు చేసిన విషయం విధితమే. అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఛటర్జీని కోల్‌కతాలోని బ్యాంక్‌షాల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఛటర్జీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. మంత్రికి ఆరోగ్యం బాగోలేదని, ఈడీ కస్టడీకి అనుమతిస్తే ఆయనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. మరోవైపు మంత్రికి సంబంధించిన 14 ప్రదేశాల్లో సోదాలు చేపట్టామని, ఆయన సన్నిహితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Teacher recruitment scam: బెంగాల్ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ
మరోవైపు తన క్లైంట్ నివాసం నుంచి ఎలాంటి సొమ్ము స్వాధీనం చేసుకోలేదని ఛటర్జీ న్యాయవాది చెబుతున్నారు. ఇక తనకు ఛాతీలో నొప్పి వస్తోందని వైద్య సాయం కావాలని మంత్రి అధికారులను కోరారు. ఇదిలాఉంటే రెండు రోజుల విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో సోమవారం వరకు ఛటర్జీని ఈడీ విచారించనుంది. ఆపై మంత్రి పార్ధ ఛటర్జీని మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కోర్టులో ప్రవేశపెడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి వెస్ట్ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ నివాసంతో పలువురు మంత్రులు, అధికారుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫెడరల్ ఏజెన్సీ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆమె నివాసంలో నిర్వహించిన సోదాల్లో భాగంగా రూ. 21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖర్జీ ప్రాంగణంలో 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని విచారణ జరుగుతుందని ఈడీ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే విచారణలో భాగంగా వారి ఆస్తులపై దాడులు జరిగిన వారిలో మాణిక్ భట్టాచార్య, రత్న చక్రవర్తి బాగ్చి, SPసిన్హాలు ఉన్నారు.