Covid 19 Central Govt Allows More Employees To Work From Home
Employees Work from Home : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని వర్గాలకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించింది. వికలాంగ ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలు పూర్తిగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చింది. ఆఫీసుల్లో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని తెలిపింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు మరింత విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలలో పనిచేసే గ్రూప్-బి, గ్రూప్-సి స్థాయి ఉద్యోగులకు వర్తిస్తాయి. గ్రూప్-ఎ స్థాయి అధికారులకు పనిగంటల్లో వెసులుబాటు కల్పిస్తోంది.