భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది.
అయితే మిగతా కరోనా ప్రభావిత దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. సోమవారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 50,921కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో మరో 941 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
ఈ మహమ్మారి కారణంగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దాదాపు 941 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. కాగా, దేశంలో కొత్తగా 57,982 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది.
కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 19లక్షల మంది బయటపడ్డారు. మరో 6లక్షల 76 వేల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీటి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం ఊరట కలిగించే విషయం.
సోమవారం నాటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల టెస్టులు చేసినట్టు ఐసీఎమ్‌ఆర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.5శాతం ఉండగా, మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది.