Delta Plus
Covid-19 Delta Plus Variant : డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరమా? మాస్కు లేకుంటే ముప్పు తప్పదా? మాస్కు లేకుండా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గి సాధారణ జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. జనాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే మరో కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ మరింత శక్తివంతమైన ప్రభావంతో డెల్టా ప్లస్‌గా మారినట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారుతోందని, దీని బారిన పడిన వారి పక్క నుండి, మాస్క్ పెట్టుకోకుండా వెళ్లినా మహమ్మారి బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
దేశంలో డెల్టా ప్లస్ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు.
ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకుతుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కొవిడ్ జాగ్రత్తలతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, అయినప్పటికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని గులేరియా స్పష్టం చేశారు.
మొదట ఇంగ్లండ్‌లో గుర్తింపు:
కరోనా వైరస్ రూపాంతరాల్లో డెల్టా ప్లస్ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్‌లో రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్‌లోని కొమ్ము (స్పైక్) ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్‌లో గతంలోనే గుర్తించారు.
బీటా రకం కంటే డెల్టా వేరియంట్‌కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇటీవలే వెల్లడించారు.
11కుపైగా దేశాల్లో కేసులు:
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్‌తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్ తదితర దేశాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్‌లో ఏప్రిల్ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్‌లోనే డెల్టా ప్లస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్‌లో తొలి ఐదు కేసులను ఏప్రిల్ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు.
ప్రమాదం ఎంత?
రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్‌తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి.
మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు మొదలయ్యాయి. డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ బారిన 21మంది పడ్డారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న సమయంలో ఇది బయటపడటం స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని నిపుణులు తేల్చి చెప్పారు.