India Covid Updates : భారత్‌లో గంటకు 10వేల కోవిడ్ కేసులు.. 60 మరణాలు

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు ఇండియా వణికిపోతోంది. గతంలో కంటే రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైన కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

India Covid Second Wave : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు ఇండియా వణికిపోతోంది. గతంలో కంటే రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైన కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి సగటున గంటకు 10వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే గంటకు 60 కరోనా మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా 72వేలపైన కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 459 కరోనా మరణాలు నమోదయ్యాయి. రోజు సగటున గంటకు 3వేల కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి.

గత ఆదివారం నాటికి కరోనా మరణాల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సగటున గంటకు 10,895 కొత్త కేసులు నమోదవుతుండగా.. గంటకు 60 మందికి పైగా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ గణంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 2,59,170 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. సగటున గంటకు 10,798 కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

గతేడాది సెప్టెంబరులో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో రోజువారీ కేసులు గరిష్ఠంగా 97వేలకు పైగా నమోదయ్యాయి. అక్టోబరు తర్వాత నుంచి వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. 2021 ఏడాది ఫిబ్రవరిలో రోజువారీ కేసులు 10వేల లోపునకు పడిపోయాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత నుంచి క్రమక్రమంగా రోజువారీ కేసులు పెరిగాయి. గత 41 రోజులుగా కొత్త కేసులు స్థిరంగా పెరుగుతూ 2లక్షల మార్క్‌ దాటేశాయి. అమెరికా తర్వాత ప్రపంచంలో రోజుకు 2లక్షల పైనే కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో దేశంలో యాక్టివ్ కేసులు అమాంతం పెరిగి 20లక్షల మార్క్‌ను దాటేశాయి. ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.53కోట్లు దాటేసింది.

ట్రెండింగ్ వార్తలు