ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని తమ పార్టీ ఇండియా బ్లాక్ నుంచి బయటకి వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పారు.
ఆప్, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఇండియా బ్లాక్‌లో కలిసి పోటీ చేశాయి. అయితే, హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి.
ఇండియా బ్లాక్ ఏర్పాటు లోక్‌సభ ఎన్నికల కోసమేనని, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసిందని సంజయ్ సింగ్ చెప్పారు. “ఇండియా బ్లాక్ నుంచి ఆప్ బయటకి వచ్చింది. మా పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పష్టంగా చెప్పారు. మేము ఆ అలయన్స్‌లో భాగం కాదు” అని అన్నారు.
“మేము హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశాం. పంజాబ్, గుజరాత్ ఉపఎన్నికల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేశాం. పార్లమెంట్ అంశాల్లో తృణమూల్, డీఎంకే వంటి పార్టీల మద్దతు తీసుకుంటాం. వాళ్లు కూడా మద్దతు ఇస్తారు. మేము శక్తిమంవంతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ఏ సమస్యలు ఉన్నా పార్లమెంట్‌లో లేవనెత్తుతాం” అని అన్నారు.