Delhi : పెంపుడు కుక్కల కోసం శ్మశానం..వీధి కుక్కల కోసం అంబులెన్స్

Crematorium For Dogs Inaugurated In South Delhi : దేశంలోని చాలా గ్రామాల్లో శ్మశానవాటికలే లేవు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కుక్కల కోసం ఓ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఘిటోర్నిలో నగవాసుల పెంపుడు కుక్కలు మరణిస్తే వాటి కళేబరాలను దహనం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ శ్మశానవాటికను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కుక్కల శ్మశానాన్ని మేయర్ అనామికా బుధవారం (అక్టోబర్ 7,2020) ప్రారంభించారు.
ఢిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కుక్కల శ్మశానవాటిక రెండు దహన ఫర్నేసులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఈ శ్మశానవాటికలో 45 నుంచి 60 నిమిషాల పాటు కుక్కల కళేబరాలను గౌరవంగా దహనం చేయవచ్చని తెలిపారు.
కాగా శ్మశానం అంటే ఎక్కడ చూసినా సమాధులతో భీతావహంగా ఉండకుండా చుట్టూ పచ్చదనంతోపాటు పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన కుక్కల శ్మశానవాటిక జాగిలాల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఢిల్లీ నగరంలో గాయపడిన కుక్కలకు చికిత్స కోసం తీసుకువెళ్లడానికి డాగ్ రెస్క్యూ అంబులెన్సు కూడా మేయరు ప్రారంభించారు. గాయపడిన వీధి కుక్కలకు చికిత్స చేయించి మళ్లీ వాటిని వదిలివేస్తామని ఢిల్లీ మేయరు చెప్పారు.