కరోనాతో భయపడుతున్న వేళ ఒక్కసారిగా 50 కాకులు, 3 కుక్కలు మృతి.. అసలేం జరిగింది

అసలే తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఇది చాలదన్నట్టు మరో కలకలం రేగింది. ఉన్నట్టుండి 50 కాకులు, మూడు కుక్కలు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌ లో ఒక్కసారిగా కాకులు, కుక్కలు మృతి చెందాయి. ప్రస్తుతం కరోనా వైరస్ తో భయపడుతున్న ప్రజలు ఈ ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యారు.

శునకాలు, కాకుల మృతి విషయంపై గ్రామ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అధికారులు చనిపోయిన శునకాలు, కాకుల నుంచి నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం వాటి మృతికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. మరోవైపు, వీటిపై విష ప్రయోగం జరిగిందా? అనే విషయమై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, జంతువులకు కూడా కరోనా వైరస్ సోకుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో వీటి మృతితో స్థానికులు మరింత భయాందోళనకు లోనయ్యారు.

కాకులను, కుక్కలను పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వి బ్లీచింగ్ చల్లారు. అలాగే ఊరంతా బ్లీచింగ్ చల్లారు పారిశుధ్య కార్మికురాలు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు.