×
Ad

Delhi blast : ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారుకు పుల్వామా లింక్‌!

Delhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో

Delhi blast

Delhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారంసాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. తొమ్మిది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతికాగా.. 24 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

లాల్ ఖిలా మెట్రో స్టేషన్ కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఐ20 కారు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్ర కోణం వంటివి ఉన్నాయో అనే విషయంను తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి. దేశంలో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి, పెద్దఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఉగ్రనెట్ వర్క్ కు, తాజా పేలుడుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లు సమాచారం. చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ ఈ కారును కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పేలుళ్లకు ముందు కారుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హ్యూందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం 6.52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతను వైద్యుడైన మహ్మద్ ఉమర్ అని అనుమానిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ పేలుడు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడేనని పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడిచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు గురైన కారు హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉంది. దీంతో ఆ కారు ఓనర్ మహ్మద్ సల్మాన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. దానిని తారిఖ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఆ కారు డాక్టర్ ఉమర్ చేతికి వెళ్లింది. అయితే, డాక్టర్ ఉమర్ ఈ కారును నడిపినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తుండగా.. పేలుళ్లలో చనిపోయిన అతన్ని.. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.