Delhi blast
Delhi blast: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు చేస్తున్నా కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మరణించగా.. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన కీలక అనుమానితుడు డాక్టర్ ముజమ్మిల్, అతని సహాయుడు ఉమర్ బాంబు పేలుడుకు ముందే ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.
ఫరీదాబాద్ లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. అతని ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్న డేటా ప్రకారం.. గణతంత్ర దినోత్సవం నాడు దాడి చేయడానికి.. బహుశా ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే చారిత్రాత్మక స్మారక చిహ్నాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రణాళికను రచించినట్లుగా భావిస్తున్నారు.
ఇదిలాఉంటే.. పేలుడుకు కారణమైన హ్యుందాయ్ ఐ20 కారును డాక్టర్ మహ్మద్ ఉమర్ నడిపినట్లు నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు బృందాలు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగిన సంభాషణలను గుర్తించడానికి ఎర్రకోట ప్రాంతం నుంచి మొబైల్ టవర్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు.. టెలీగ్రామ్ గ్రూపులు, టర్కీ పర్యటన వివరాలపై దర్యాప్తు బృందాలు దృష్టిసారించాయి. రెండు కీలక టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా డాక్టర్ల మాడ్యూల్‌కు చెందిన తీవ్రవాదాన్ని విస్తరించారని దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఫర్జాందర్ -ఎ -దారుల్ ఉలూమ్ (డియోబంద్), పాకిస్థాన్‌లో జైషే అహ్మద్ కార్యకర్త ఉమర్ బిన్ ఖత్తాబ్ నడుపుతున్న గ్రూపుగా తెలుస్తోంది.
ఎర్రకోట బాంబు దాడిలో నిందితుడిగా పేర్కొంటున్న డాక్టర్ మొహమ్మద్ ఉమర్, షోపియన్ పట్టణంకు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ వాగే ఈ గ్రూపుల ద్వారా తమ ఉగ్రవాద బోధనను ప్రారంభించారని తెలుస్తోంది. మొదట్లో కాశ్మీర్ ఆజాదీ, కాశ్మీరీల అణచివేత గురించి చర్చించి.. అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారని తెలుస్తోంది. టర్కీ పర్యటన మాడ్యూల్‌ను ఏకం చేయడంలో కీలమైన దశను సూచిస్తుంది.
దీంతో ఎర్రకోట పేలుడులో టర్కీ సంబంధాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీ పర్యటన తరువాత ఫరీదాబాద్, సహరాన్‌పూర్‌తో సహా లక్ష్య స్థానాలను ఎంపిక చేసుకొని భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని డాక్టర్ మాడ్యూల్‌ను హ్యాండ్లర్ ఆదేశించాడని వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఎర్రకోట పేలుళ్ల కేసులో 9వ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్తియాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రడాక్టర్లలో ఒకరైన ముజిమ్మిల్ అతని ఇంట్లోనే పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు గుర్తించారు.