అంబానీకి బెదిరింపు కేసు : సచిన్ వాజేను మహా సర్కార్ కాపాడుతోందన్న ఫడ్నవీస్
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.

Devendra Fadnavis
Devendra Fadnavis రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు.. సస్పెన్షన్కు గురైన సచిన్ వాజేను మళ్లీ పదవిలో నియమించాలని శివసేన తనపై ఒత్తిడి తెచ్చిందని ఫడ్నవీస్ తెలిపారు.
2018లో తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన వద్దకు వచ్చి సచిన్ వాజేకు పదవి తిరిగివ్వాలని కోరారని.. శివసేన పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఇదే విధంగా అభ్యర్థించారని ఫడ్నవీస్ తెలిపారు. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు తాను అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నానన్నారు బాంబే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాజేను సస్పెండ్ చేసినందున ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వలేనని తాను శివసేన నేతలకు తేల్చి చెప్పానని ఫడ్నవీస్ తెలిపారు.
బాంబే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. 16ఏళ్లు సస్పెన్షన్ లో ఉన్న సచిన్ వాజేను 2020లో శివసేన ప్రభుత్వం మళ్లీ ఎందుకు నియమించిందని ఫడ్నవీస్ ప్రశ్నించారు. శివనేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కరోనా సాకుతో ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకున్నదని విమర్శించారు. అంతేగాక సచిన్ వాజ్‌ను క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్‌గా చేసి అనేక ప్రధాన కేసులు అప్పగించారని ఆరోపించారు. సీఎం, హోంమంత్రి ఆయన న్యాయవాదుల మాదిరిగా వాజేను రక్షిస్తున్నారని ఇదివరకే ఫడ్నవీస్ విమర్శించారు.
కాగా, సచిన్ వాజేను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు వాజేకు రిమాండ్ విధించింది. పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో.. పీపీఈ కిట్ ధరించి, సీసీటీవీ కెమెరాలో చిక్కిన వ్యక్తి పోలీసు అధికారి సచిన్ వాజేనే అని బుధవారం ఎన్ఐఏ స్పష్టం చేసింది.