దీపావళి పండుగ అంటే దీపాల ఉత్సవం. ప్రతి ఇల్లు దీప కాంతులతో వెలిగిపోయే శుభదినం. దీపావళి అంటే ఒక్కరోజు పండుగ కాదు. ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటినుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది.
మొదటిరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి – ధన త్రయోదశి
రెండవ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి – నరక చతుర్దశి
మూడవ రోజు ఆశ్వయుజ అమావాస్య – దీపావళి
నాలుగవ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి – గోవర్థన పూజ
ఐదవ రోజు కార్తీక శుద్ధ విదియ – భగినీ హస్తభోజనం
ఈ ఐదు పండుగలు కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు. ఉత్తర భారతదేశంలో ఈ ఐదు పండుగలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, భగినీ హస్తభోజనం పండుగలను జరుపుకుంటారు.
అస్సాం, బెంగాల్ : ఈ రాష్ట్రాలలో దీపావళిని ‘జగద్ధాత్రి పూజ’గా చేసుకుంటారు. బెంగాల్ లో ‘కలిపూజ’ను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఒరిస్సా : ‘కుమార పూర్ణిమ’గా కృష్ణ త్రయోదశి నాడు మొదలు పెట్టి దీపావళి వరకూ దీపోత్సవాలతో, ఆటపాటలతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
తమిళనాడు : దీపావళి పండుగను రాత్రి కాకుండా ఉదయమే జరుపుకుంటారు.
కర్నాటక : మొదటి మూడు రోజులు దీపావళి పండుగను జరుపుకుంటారు. అంటే ధన త్రయోదశి, నరక చతుర్ధశి, అమావాస్య నాడు దీపావళిగా జరుపుకుంటారు.
రాజస్థాన్ : దీపావళిని ‘ధన్ తెరాన్’గా చేసుకుంటారు. దీపావళి పండుగ రోజున మహిళలంతా తమ నగలను నదిలో శుభ్రం చేసుకుంటారు. అనంతరం పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పండుగ రోజున చేసిన అన్ని రకాల వంటలూ పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.
గుజరాత్, మహారాష్ట్ర : రకరకాల పిండివంటలు చేస్తారు. వాటితో ‘లక్ష్మీపూజ’ను చేసుకుంటారు. దీపావళి రోజున వ్యాపారస్తులు కొత్త పద్దుల (ఎకౌంట్స్)పుస్తకాలు ప్రారంభిస్తారు.
కేరళ : వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కివేసిన రోజునే దీపావళిగా చేసుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా కేరళవాసులు బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి…అంటే ఈ ‘దీపావళి’ రోజున భూమిమీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటాడని కేరళరాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళీయులు ఈ ‘దీపావళి’ పండుగను ‘బలి అమావాస్య’గా జరుపుకుంటారు.
ఉత్తరప్రదేశ్ : రావణుడిని అంతంచేసిన తరువాత శ్రీరాముడు సీతాసమేతుడై.. ఈ ‘దీపావళి’ నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడని యూపీ వాసులు నమ్ముతారు. ఈ సందర్భంగా అయోధ్యానగర ప్రజలందరూ దీపాల వరుసలతో శ్రీరామునకు స్వాగతం పలికి..సంతోషంతో బాణాసంచా కాల్చుకుంటారు.
పంచపాండవులు అఙ్ఞాతవాసం ముగించి హస్తినకు వచ్చినదీ ఈ ‘దీపావళి’ రోజునే అని పురాణాలు చెబుతున్నాయి.
షట్చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు.
తొలి తెలుగురాజైన శాలివాహనుడు.., ఈ దీపావళి రోజునే విక్రమార్కుని ఓడించి..ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
రాముడు లోక కంఠకుడైన రావణుడ్ని చంపి సీతతో పాటు అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన శుభదినం.
ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే ‘దీపావళి’ అంటే ఇంత ఆకర్షణ..ఆనందం..సంతోషం..అందుకే దీపావళి పండుగను అత్యంత శోభాయమానంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు భారతీయులందరూ. దీపాలు వెలిగించే పండుగ అందరి ఇళ్లల్లోను సంతోషాలను నింపాలని..జీవితాలను ఆనందమయంగా మలచుకుంటారనీ ఆశిస్తూ అందరికీ ‘దీపావళి శుభాకాంక్షలు’. దీపావళి పండుగను ఏ రాష్టంలో ఎలా జరుపుకున్నా..ఏ పేరుతో చేసుకున్నా..దీపావళి పండుగ అంటే ఆనందాల వెలుగుల పండుగే.