Railway Employees Bonus: దీపావళి పండగ ముందు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది కేంద్రం. 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బోనస్ గా 1866 కోట్ల చెల్లింపులకు ఆమోదం లభించింది.
ఈ బోనస్ ను దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఏడాది ఇస్తున్న ఈ బోనస్ ను ఈ ఏడాది కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వే సిబ్బంది కృషితో ఆర్థిక ప్రగతిలో పెరుగుదల సాధ్యమైందని ప్రభుత్వం అభిప్రాయపడింది. నాన్ గెజిటెడ్ కేటగిరీలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు బోనస్ గా అందనుంది.
గత సంవత్సరం అక్టోబర్ 03న 11.72 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్ చెల్లింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను మంత్రివర్గం ఆమోదించింది. రూ.2,029 కోట్లు చెల్లింపులు చేసింది.
ఈ మొత్తాన్ని రైల్వే సిబ్బందిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్ లు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సిబ్బందికి చెల్లించారు. రైల్వే ఉద్యోగులు తమ పనితీరుని మెరుగుపరుచుకునేలా ఈ బోనస్ ఒక ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నది కేంద్రం అభిప్రాయం. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు బోనస్ ఇస్తోంది కేంద్రం.
Also Read: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పీజీ, ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్నంటే